రాజకీయాలు చాలా అంటే చాలా డర్టీ. అందులో ఉన్న వారు ఆ బురద అంటుకుంటుందని పద్దతిగా ఉండాలనుకుంటే సాధ్యం కాదు. ఎవరో ఒకరు అంటించేస్తారు. ఇక అంటుకుంది కదా ఇక పూర్తిగా మునిగిపోతే తప్పేముందని అప్పటి దాకా కాస్త పద్దతిగా ఉన్నవారు కూడా బురద రాజకీయాల్లోకి దిగిపోతారు. అది రాను రాను దిగజారిపోతూ ఉంటుంది. దానికి సాక్ష్యం .. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న చావు చుట్టూ జరుగుతున్న రాజకీయాలే. అది కూడా బీఆర్ఎస్ అధినేతను టార్గెట్ చేసుకుని. ఒక పార్టీ కాదు..రెండు పార్టీలదీ అదే వరుస.
రేవంత్ రెడ్డి విమర్శల్లో కేసీఆర్ చావును వెదుకుతున్న బీఆర్ఎస్
రేవంత్ తన ప్రసంగాన్ని కేసీఆర్ ను విమర్శిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆయన ఇతర దేశాల్లో అయితే రాళ్లతో కొట్టవారు.. ఆయనను ఉరి తీసినా తప్పు లేదు అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మాటల్ని పట్టుకుని బీఆర్ఎస్ నేతలు వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. అది రేవంత్ రెడ్డి కేసీఆర్ చావును కోరుకుంటున్నారని విమర్శలు ప్రారంభిస్తున్నారు. రేవంత్ రెడ్డికి మానవత్వం లేదని రాజకీయ ప్రత్యర్థి చావును కోరుకుంటున్నారని గుక్క తిప్పుకోకుండా ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ అవే జరుగుతున్నాయి.
కేసీఆర్ చావును కోరుకునే కేటీఆర్, హరీష్ రావేనని కాంగ్రెస్ కౌంటర్
కేసీఆర్ చావు గురించి.. రేవంత్ రెడ్డి ఎప్పుడూ మాట్లాడకపోయినా.. ఆయన చేసే విమర్శల్లో వెదుక్కుని మరీ రేవంత్ కేసీఆర్ చావును కోరుకుంటున్నారని ప్రచారం చేయడం కాంగ్రెస్ నేతల్ని ఆగ్రహానికి గురి చేస్తోంది. ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్ చావును తాను ఎందుకు కోరుకుంటానని రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారు. ఆయనకు బాగోలేనప్పుడు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించానన్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. అయినా బీఆర్ఎస్ విమర్శలు ఆపకపోవడంతో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ చావును కోరుకునేది హరీష్ రావు, కేటీఆర్లేనని కౌంటర్లు వేస్తున్నారు. తమ సొంత రాజకీయాల కోసం వారే ఆయనకు హాని చేస్తారేమోనని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ పై సానుభూతి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందా?
కేసీఆర్ గురించి కనీసం చెడుగా ఒక్క మాట ఆలోచించడానికి కూడా బీఆర్ఎస్ పెద్దలు సిద్ధపడకూడదు. చావు కోరుకుంటున్నారని ఇతర పార్టీలపై రాజకీయం చేయకూడదు. కానీ రాజకీయాల్లో ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకోవడానికి అవకాశం లేదు. అందుకే బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ చావు గురించి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఈ చర్చ ఇలా అంతు లేకుండా సాగుతోంది. ఈ వ్యవహారం మొత్తంలో అసలు కేసీఆర్ ఎంత మథన పడుతూంటారో మాత్రం.. రెండు పార్టీలు ఆలోచించడం లేదు.
