2023 డిసెంబర్ వరకూ తెలంగాణ అంటే టీఆర్ఎస్ .. టీఆర్ఎస్ అంటే తెలంగాణ. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ సీఎంగా ఉంటారు. ఆయన తెలంగాణ బాపు అని ప్రచారం చేసుకున్నారు. కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందని.. ఆ బీఆర్ఎస్తో తమకు సంబంధం లేదని తెలంగాణ ప్రజలు 2023 డిసెంబర్ లో తీర్పు ఇచ్చారు. అప్పటి వరకూ ఆకాశంలో ఉన్న ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఒక్క సారిగా కిందపడిపోయారు. ఇప్పటి వరకూ లేవలేదు సరి కదా.. రోజు రోజుకు పాతాళంలోకి వెళ్లిపోతున్నారు. కవిత ఇష్యూతో ఆ పార్టీ ఉనికిపైనా ప్రశ్నలు వస్తున్నాయి.
పెరిగింది విరుగుట కొరకే అన్నట్లుగా పతనం
భారత రాష్ట్ర సమితి ప్రస్థానం.. కేసీఆర్ ఆమరణ దీక్ష తో ఓ రేంజ్ కు వెళ్లింది. అప్పటి నుంచి పదిహేనేళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్కు తిరుగులేదు. ఎంతగా అంటే ఆ పార్టీలో చేరే వారే కానీ.. బయటకు వెళ్లే వారు ఉండేవారు కాదు. అందర్నీ కలిపేసుకుని తెలంగాణలో ఏక పార్టీ వ్యవస్థను తీసుకు రావాలన్న ఉత్సాహంలో కేసీఆర్ ఉండేవారు. అదే దిశగా ఏ పార్టీలో గెలిచినా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరిపోయేవారు. ఇక వేరే పార్టీలకు ఓటు వేయడం దండగ అన్న అభిప్రాయం కూడా తీసుకు వచ్చారు. అయితే రాజకీయాల్లో ఇలాంటి ఇన్స్టంట్ పెరుగుదలలు ఖచ్చితంగా పతనానికే కారణం అవుతోంది. కానీ టైం రావాలంటే. బీఆర్ఎస్కు ఆ టైమ్ ఏడాదిన్నర కిందట వచ్చింది. అప్పటి నుంచి పతనమవుతూనే ఉంది.
డిపాజిట్లు కూడా రానంత ఘోరమైన ఓటములు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమే ఓ పెద్ద షాక్ అనుకుంటే తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు రాకుండా పోయాయి. అయినా తెలంగాణ అంటే మేమే..మేము అంటేనే తెలంగాణ అన్నట్లుగా పన్ వే రాజకీయాలు చేసుకుంటున్నారు. కానీ ప్రజల సెంటిమెంట్ ఏమిటో.. తమ గురించి ప్రజలు ఏమంటున్నారో ఆలోచించడం లేదు. తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు సొంత కుటుంబంలో చీలిక వచ్చింది. పార్టీ కోసం పని చేసిన కవిత సొంత పార్టీ పెట్టుకుంటున్నారు. ఆమెతో పాటు ఎవరూ వెళ్లకపోవచ్చు కానీ.. కేసీఆర్ కుటుంబమే చీలడం ఆ పార్టీకి నైతిక దివాలా లాంటిది. పతనం దారిలో మరో ముఖ్య ఘట్టం.
ఉనికి కాపాడుకోవడం అంత తేలిక కాదు !
కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మానసికంగా కూడా ధైర్యం కోల్పోయినట్లుగా ఉన్నారు. ఫామ్ హౌస్ కు రావడం లేదు. ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ అసెంబ్లీకి రావడం లేదు. అసలు పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడంలేదు. ఇరవై ఐదు ఏళ్ల సభ ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించలేదు. అందుకే ఇప్పుడు ఆ పార్టీ ఉనికిపై ఎక్కువగా చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ రాజకీయం తెలివితేటల్లో కేటీఆర్ కు కనీస మాత్రం వారసత్వంగా వచ్చాయని కూడా ఎవరూ నమ్మడం లేదు. భావోద్వేగాలకు గురయి.. తిట్లందుకోవడం.. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం ఆయన మానలేకపోతున్నారు.
భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఇప్పుడు చాలా క్లిష్టంగా ఉన్నది మాత్రం నిజం. నాయకత్వ సమస్యలు ఆ పార్టీని పాతాళంలోకి నెట్టేస్తున్నాయి. ఉనికిని కాపాడుకోవడమే ఓ సవాల్‌గా మారింది.