కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఫామ్ హౌస్కు మరోసారి అగ్రనేతలు వెళ్లారు. కేసీఆర్ తో చర్చించారు. కాళేశ్వరం రిపోర్టు ప్రభుత్వానికి అందినప్పటి నుండి..కేసీఆర్ న్యాయనిపుణులు, పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. చివరికి న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకుని హైకోర్టుకు వెళ్లారు.కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ప్లాన్ బీ పై చర్చిస్తున్నారు. ఏం చేయాలన్న దానిపై కేసీఆర్.. తన అనుభవాన్నంతా ఉపయోగించి.. తదుపరి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు.
సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన
హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే అక్కడ కూడా ఇలాంటి తీర్పే వస్తే.. వెళ్లి వెళ్లి ప్రభుత్వం నోట్లో చిక్కినట్లు అవుతుందన్న ఆందోళన ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా అసెంబ్లీ ఎలాంటి చర్యలు నేరుగా తీసుకోవడం కష్టం. కానీ సిట్ ఏర్పాటు చేయడం లేదా.. ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించడం వంటివి చేయవచ్చు. అసెంబ్లీకి ఉండే ఈ హక్కును కోర్టులు కూడా నియంత్రించలేవు. ఈ విషయం శాసన విషయాల్లో పండిపోయిన కేసీఆర్ వంటి వారికి తెలియనిదేం కాదు. కానీ ఆ రిపోర్టుపై చర్యలపై కనీసం స్టే వచ్చేలా చేసుకుంటే.. మంచిదని గట్టిగా నమ్ముతున్నారు.
మొత్తం రిపోర్టు బయటపెడితే విస్తృత చర్చ
అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును బయట పెట్టాలని రేవంత్ నిర్ణయించారు. అప్పుడు దానిపై జరిగే చర్చ చాలా ఎక్కువగా ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా.. కనీసం కేబినెట్ అనుమతి లేకుండా.. నిపుణుల సూచనలు పట్టించుకోకుండా కేసీఆరే ఏకపక్షంగా బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను ఖరారు చేశారని బయటపడుతుంది. అలాగే నిధుల దుర్వినియోగంపైనా .. ప్రజల్లో విస్తృత చర్చకు పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉంటారు. ఇదే బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని ఆందోళనకు గురి చేస్తోంది. తాము ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్టును తెలంగాణకు వరప్రదాయనిగా చెబుతూ వస్తున్నామని .. కానీ దాని వల్ల ఉపయోగం లేదన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తే సమస్యలు వస్తాయని అనుకుంటున్నారు.
ఎజెండా తమ సమస్యలే తప్ప.. ప్రజాసమస్యలు కాదు !
భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ.. ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలు ఏవీ లేవు. తమ సొంత సమస్యలపై పోరాటంలోనే వారు మునిగి తేలుతున్నారు. రేవంత్ రెడ్డి పక్కా ట్రాప్ విధించారు. రైతులకు యూరియా సమస్య వెంటాడుతున్నా…. ప్రణాళికాబద్ధంగా ఓ ఉద్యమాన్ని నిర్మించలేకపోయారు. ఇదొక్కటే కాదు చాలా ప్రజా సమస్యలపై స్పందించేంత తీరిక వారికి ఉండటం లేదు. వారి సమస్యలే వారికి ఇప్పుడు రాజకీయ అవసరం.. అవే ప్రజా సమస్యలు అనుకోవాల్సి వస్తోంది.