రాజకీయాల్లో కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన దానం నాగేంద్రం జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీనిపై రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఓ వైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ పూర్తి చేశారు. నిర్ణయం వెలువరించాల్సి ఉంది. కానీ ఈ విచారణ దానం నాగేందర్ పై జరగలేదు. ఆయన స్పీకర్ నోటీసులకు ఇంకా స్పందించలేదు.
దానం నాగేందర్ తాను భారత రాష్ట్ర సమితిలో ఉన్నానని చెప్పడం లేదు. కానీ ఆయన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ లో ఉన్నానని చెబితే మరి కాంగ్రెస్ తరపున ఎందుకు పోటీ చేశావన్న ప్రశ్న వస్తుంది. అందుకే ఆయన ఆ దారిలో వెళ్లడం లేదు. ఆయితే గతంలో హైడ్రాతో పాటు మరికొన్ని అంశాల్లో సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదని అసంతృప్తికి గురయ్యారు. కేసీఆర్, కేటీఆర్ ను పొగిడారు. కానీ తర్వాత మళ్లీ సర్దుకున్నారు.
దానం తీరుపై అందుకే కేటీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దానం నాగేందర్ ఏ పార్టీలో గెలిచాడు? ఏ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. AICC అంటే ఆల్ ఇండియా కరెప్షన్ కమిటీ అని.. మా పార్టీలో గెలిచినోళ్లను తీసుకొని, వాళ్ల పార్టీ క్యాంపెయినర్ల లిస్ట్‌లో పెట్టారని మండిపడుతున్నారు. స్పీకర్ దగ్గరేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు అని అబద్ధాలు చెప్తున్నారని విమర్శిస్తున్నారు. జూబ్లిహిల్స్ లో దానంకూ మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ గెలవాలంటే ఆయన సహకారం కూడా కీలకమే.