బీఆర్ఎస్ ఎంపీ హెటెరో పార్థసారధి రెడ్డి బీజేపీకి అత్యధికంగా విరాళాలు ఇచ్చిన తెలంగాణ వ్యాపారవేత్తగా నిలిచారు. హెటెరో కంపెనీ యజమాని అయిన పార్థసారథి రెడ్డి బీఆర్ఎస్ కన్నా బీజేపీకే ఎక్కువ విరాళాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా రూ.15 కోట్లు బీజేపీకి విరాళంగా ఇచ్చిన ఆయన ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా కంపెనీ అయిన హెటెరో లాబ్స్ నుంచి రూ. 25 కోట్లు ఇచ్చారు. అంటే దాదాపుగా నలభై కోట్లు ఆయన ఒక్క ఏడాదిలో బీజేపీకి విరాళంగా ఇచ్చారు.
ఇక తెలంగాణ లోని అపర్ణ రియల్ ఎస్టేట్ సంస్త 2 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా కూడా తెలంగాణకు చెందిన ఫార్మా దిగ్గజాలు బీజేపీకి భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రూ. 35 కోట్లు, అరబిందో ఫార్మా రూ. 35 కోట్లు, దివిస్ ల్యాబ్స్ రూ. 15 కోట్లు విరాళాలు ఇచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి దారుణంగా విరాళాలు పడిపోయాయి. స్వయంగా బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న పార్థసారధి రెడ్డి బీజేపీకే ప్రాధాన్యం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విరాళాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. బీజేపీకి అందిన మొత్తం విరాళాలు రూ. 6,088 కోట్లకు చేరాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి అందిన విరాళాలు రూ. 522 కోట్లు మాత్రమే. అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే విరాళాలు ఎక్కువగా వస్తాయి. కానీ రాజకీయ పార్టీలకు సంస్థలు ఇచ్చే విరాళాల్లో 90 శాతం బీజేపీ పార్టీకే వెళ్లడం ఇక్కడ అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తోంది.
