భారత రాష్ట్ర సమితి రాజకయాలు, వారి రాజకీయ వ్యూహాలు పూర్తిగా ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోయేలా ఉంటున్నాయి. దానికి తాజా ఉదాహరణ మ్యాప్ వివాదం. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత నారా లోకేష్ ను కలిశారు. ఆ సమమంలో దేశ సాంస్కృతిక వైభవం అనే ఓ మ్యాప్ ను లోకేష్‌కు ఇచ్చారు. దాన్ని పరిశీలనగా చూసిన బీఆర్ఎస్.. అందులో తెలంగాణను గుర్తించలేదని కనిపెట్టారు. అంతే.. తెలంగాణ అస్థిత్వాన్ని కించ పరిచారని.. గగ్గోలు ప్రారంభించారు.
కేటీఆర్ నేరుగా ప్రధానమంత్రికి ట్వీట్ చేశారు. అది మీ పార్టీ విధానం అయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. దాసోజు శ్రవణ్ ప్రెస్‌మీట్ పెట్టి.. తెలంగాణ అస్థిత్వంపై చంద్రబాబు దాడి చేస్తున్నాడన్నారు. అసలు ఈ అంశంపై మోదీకి, చంద్రబాబుకు ఎక్కడ లింక్ ఉందో బీఆర్ఎస్ నేతలకే తెలియాలి. అంతేనా.. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు టాస్క్ ఇచ్చారు. దాన్ని వైరల్ చేసేలా పోస్టులు పెట్టమని సూచనలు వెళ్లాయి. దాంతో అందరూ పెట్టేస్తున్నారు.
అసలు మాధవ్ ఇచ్చిన మ్యాప్ రాష్ట్రాలను గుర్తించేది కాదు. సాంస్కృతిక ప్రత్యేకతలను వివరించేది. తెలంగాణ ఏర్పడక ముందు నుంచీ అలాంటి మ్యాపుల్ని అమ్ముతూంటారు. ఎప్పుడో తనకు గిఫ్టు గా వచ్చిందో.. లేకపోతే తాను కొనుక్కొచ్చిన దుకాణంలో ఉన్నది తెచ్చి ఉంటారు. ఇందులో తెలంగాణను గుర్తించకపోవడానికి .. తెలంగాణ అస్థిత్వాన్ని కించ పర్చడానికి సంబంధం ఏముంది ?. అదేమైనా అధికారిక గెజిట్ మ్యాపా?.
తెలంగాణ ఏర్పడి పదకొండేళ్లు అయింది. తమ పార్టీ పేరుతో తెలంగాణ తీసేసి భారత్ అని ..కేసీఆర్ పెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు మ్యాపులో గుర్తించలేదని కొత్తగా సెంటిమెంట్ ప్రయత్నిస్తున్నారు. అసలు తెలంగాణ ఎదురగా ఉంది.. దేశంలో ప్రముఖ రాష్ట్రంగా ఉంది.. అలాంటిది.. ఎవరో ఇద్దరు నేతల మధ్య ఓ మ్యాప్ గిఫ్టులుగా ఇచ్చుకుంటే.. దాంట్లో తెలంగాణను గుర్తించలేదని రచ్చ చేయడం.. ఏం రాజకీయం?. ఇలాంటి వాటిని చూపించి ప్రజల్ని రెచ్చగొట్టలగలరా.. కనీసం సీరియస్ నెస్ అయినా ఉండలి కదా .. అనేది ఎక్కువ మంది అభిప్రాయంగా కనిపిస్తోంది.