జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో మైనార్టీ ఓట్లను పొందడానికి బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయం చివరికి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన వారి ఘనత కూడా తమ క్రెడిట్ అని ప్రచారం చేసుకునేదాకా వెళ్లింది. జహీరాబాద్ లో మైనార్టీలకు గురుకుల పాఠశాలల్లో చదివి నీట్ లో ర్యాంక్ సాధించి సీట్లు తెచ్చుకున్న వారితో ఓ సమావేశం ఏర్పాటు చేశారు.దీనికి కేసీఆర్, కేటీఆర్ హాజరయ్యారు. అక్కడ అంతా.. కేసీఆర్ దూరదృష్టితో గురుకుల పాఠశాలలు పెట్టారని ఆయన వల్లే తమకు మెడికల్ సీట్లు వచ్చాయని పిల్లలతో చెప్పించారు. తల్లిదండ్రులతో చెప్పించారు. కేటీఆర్, హరీష్ రావు కూడా అదే చెప్పుకున్నారు.
వారిలో చాలా మంది తాము ఒకటో తరగతి నుంచి మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చదువుకున్నామని చెప్పారు. ఒకటి నుంచి ఇంటర్మీడియట్ చదవడానికి ఇప్పుడు నీట్ రాసి సీటు తెచ్చుకోవడానికి కనీసం పదమూడేళ్లు పడుతుంది. మరి అంత ముందే కేసీఆర్ ఎలా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారో ప్రచారం చేసుకునేవారు ఆలోచించలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి గురుకుల పాఠశాలలు, మైనార్టీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వాటిలో చదువుకుంటూ వచ్చి .. కష్టపడి మెడికల్ సీట్లు సాధించిన వారి క్రెడిట్ ను బీఆర్ఎస్ నేతలు తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు.
మైనార్టీ విద్యార్థుల గురించి ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టడానికి కారణం.. జూబ్లిహిల్స్ ఉపఎన్నికలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూబ్లిహిల్స్ లో పెడితే కోడ్ ఉల్లంఘన అవుతుందని.. జహీరాబాద్ లో పెట్టి మీడియాలో విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. మైనార్టీలకు బీఆర్ఎస్ ఎంతో మేలు చేసిందని వేరే విధంగా ప్రచారం చేసుకోవచ్చు కానీ ఇలా విద్యార్థుల విజయాలను కూడా తమ వల్లే అని ప్రచారం చేసుకోవడం మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉందన్న వాదన వినిపిస్తోంది.