పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పది మందిలో తొమ్మిది మందిని సాంకేతిక కారణాలతో బయటపడేసినా.. దానం నాగేందర్ విషయంలో మాత్రం కాంగ్రెస్ దొరికిపోతుందని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీనే కాపాడినట్లుగా తాజా పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అనుసరించిన తీరు, పరోక్షంగా ఆయనను అనర్హత వేటు నుంచి కాపాడేలా మారింది. దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో దాఖలు చేసినట్లు చెబుతున్న ఒక అఫిడవిట్.
దానం నాగేందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. తాను దాఖలు చేసిన అర్హత పిటిషన్ పై క్రాస్ ఎగ్జామినేషన్ కు ఏలేటి హాజరయ్యారు. అందులో దానం తరపు న్యాయవాదులు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన విషయం మీకు తెలుసా అని అడిగారని, దీంతో ఈ రహస్యం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ పార్టీయే ఒక నేతను సస్పెండ్ చేస్తే, ఆ తర్వాత ఆయన వేరే పార్టీలో చేరినా అనర్హత వేటు వేయడం చట్టరీత్యా సాధ్యం కాదు.
బీఆర్ఎస్ పార్టీ ఈ అఫిడవిట్ అంశాన్ని ఇంతకాలం ఎందుకు దాచిపెట్టిందని ఏలేటి ప్రశ్నిస్తున్నారు. బయటకి అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్, లోపల మాత్రం దానంను కాపాడేలా కోర్టులో అఫిడవిట్ ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన నిలదీశారు. ఒకవేళ బీఆర్ఎస్ నిజంగానే సస్పెన్షన్ అఫిడవిట్ ఇచ్చి ఉంటే, అసలు దానం నాగేందర్‌పై అనర్హత కేసు అనేదే నిలబడదని, ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టే డ్రామా అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఈ అఫిడవిట్ ఇచ్చి ఉంటే.. ఆ పార్టీ నైతికతపై అనుమానాలు ప్రారంభమవుతాయి.