జూబ్లిహిల్స్ ఉపఎన్నిక విషయంలో కేటీఆర్ సంతోషంగానే ఉన్నారు. తమకు కలసి వచ్చే ప్లస్ పాయింట్ ఒక్కటి కూడా లేకపోయినా గట్టిపోటీ ఇచ్చారు. కంటోన్మెంట్ తరహాలో డిపాజిట్ పోలేదు. తమ ఓటర్లు ఇంకాతమ వైపు ఉన్నారు అన్న భరోసాకు కేటీఆర్ వచ్చారు. అందుకే తామే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అంటున్నారు. అయితే ఈ రియాలిటీని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అర్థం చేసుకోలేకపోతోంది. విచిత్రమైన కామెంట్లతో దండయాత్ర చేస్తున్నారు. ఈ ప్రజలకు మంచి చేసే వారు అవసరం లేదని.. రేవంత్ రెడ్డిలా వాతలు పెట్టేవారు కావాలని అంటున్నారు. చాలా మంది కేసీఆర్ ను ఇక ప్రజల్లోకి రావాల్సిన అవసరం లేదని.. రేవంత్ దెబ్బకు వారు సఫర్ అవ్వాల్సిందేనని శాపనార్ధాలు పెడుతున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ఫైనల్.. వారు చెప్పే తీర్పే నిజం
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పే ఫైనల్. అది తప్పు .. ఒప్పు అని చర్చించడానికి ఉండదు. ఎప్పటికీ తప్పు కాదు. ఎందుకంటే వారు ఇచ్చే తీర్పు ఒప్పే. దాన్ని రివ్యూ చేయలేరు. చేయగలిగితే.. ప్రజాతీర్పు వ్యతిరేకంగా వచ్చిన వాళ్లు.. అనుకూలంగా వచ్చిన వాళ్లు.. తాము చేసిన తప్పులు లేదా.. గెలవడానికి అనుసరించిన వ్యూహాలపై సమీక్ష చేసుకోవాల్సిందే కానీ.. ప్రజా తీర్పును కాదనలేరు. ప్రజలు తప్పు చేశారని అనుకుంటే అంత కంటే అమాయకత్వం పడదు. పైగా తాము ప్రజలకు ఎంతో చేశామని అయినా ఓట్లు వేయడం లేదని.. వీళ్ల కోసం పట్టించుకోవడం మానేయాల్సిందేనని కంట మంది అనడం మరీ విచిత్రంగా ఉంటుంది.
అలా అయితే పార్టీని మూసేసి ప్రజల్ని శిక్షించవచ్చుగా !
జూబ్లిహిల్స్ లో ప్రజలు బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తారని ఆ పార్టీ క్యాడర్ గట్టిగా నమ్మకం పెట్టుకుంది. వారి ఉద్దేశంలో కేసీఆర్ అసాధ్యుడు. ప్రజలకు తిరుగులేనంత మేలు చేశారు. అందుకే ఆయనకు ప్రజలు నిర్బంధంగా ఓట్లు వేయాలి. ఓట్లు వేయకపోతే కృకఘ్నులే. అలాగే నిందిస్తున్నారు. ఈ ప్రజల కోసం ఇంక కష్టపడాల్సిన అవసరం లేదని ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని అంటున్నారు. తాము అలా ఉండటం.. ప్రజల్ని శిక్షించడం అనుకుంటున్నారు. నిజానికి అదే ప్రజల్ని శిక్షించడం అయితే వెంటనే బీఆర్ఎస్ పార్టీని మూసివేసి.. ఆ పార్టీ నేతలంతా తమ వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలు చూసుకోవాలని రెడీ అయితే.. ప్రజల్ని శిక్షించినట్లే అవుతుంది కదా. ఈ లాజిక్ బీఆర్ఎస్ కార్యకర్తలు మిస్సవుతున్నారు.
సోషల్ మీడియా వల్ల ఎంత లాభమో.. అంత కంటే ఎక్కువ నష్టం
రాజకీయ పార్టీలు తమ సానుభూతిపరుల్ని సోషల్ మీడియా సైనికులుగా మార్చేస్తున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. వారిని దారి ప్పకుండా చేయాల్సిన బాధ్యత కూడా పార్టీలపైనే ఉంది. ఓటముకు ప్రజల్ని నిందిచడం అంటే.. చెరువుపై అలగడమే. అదే జరిగితే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ పదేళ్ల పాటు తిరుగులేని పవర్ అనుభవించి ఉండవచ్చు కానీ అదంతా ప్రజలు ఇచ్చిందే. ఇప్పుడు ఆయన అవసరం లేదనుకుంటున్నారు కాబట్టి ఓట్లు వేయడం లేదు. కేసీఆర్ ఎంతో చేశారని… అయినా మోసం చేశారని అనుకోవడానికి లేదు. అలా అనుకుంటే.. ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకూ మనుగడ సాగించదు. ఈ విషయంలో కేటీఆర్ తన సోషల్ మీడియా టీమ్‌కు .. ఇంకా ఎంతో నేర్పించాల్సిన అవసరం కనిపిస్తోంది.

