ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారం ముఖ్యమని బీఆర్ఎస్ నాయక్తత్వం గట్టిగా నమ్మింది. దానికి తగ్గట్లుగా జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారంలో ముందున్నారు. కేటీఆర్ మొదటి నుంచి ..బీఆర్ఎస్ సోషల్ మీడియాను చాలా బలంగా నిర్మించారు. ఇప్పుడు ఆ టీమ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. సోషల్ మీడియా పేజీలు, వ్యక్తిగత అకౌంట్లు, వైరల్ చేయాల్సిన పాయింట్లు ఇలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సర్వేలను రిలీజ్ చేసుకుని హైలెట్ అయ్యేలా చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ధాటిని తట్టుకోలేకపోతోంది.
బలోపేతం కాని కాంగ్రెస్ సోషల్ మీడియా
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ గా లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్పై కోపంతో టీడీపీ సోషల్ మీడియా సభ్యులు కూడా సహకరించారు. రేవంత్ పై కొంత అభిమానం ఉండేది. కానీ ఎన్నికల తర్వాత వాళ్లు కూడా డ్యూటీ మానేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు టీమ్ మీద ఆధారపడుతోంది. ఆ టీమ్ లో ఉన్న వాళ్లంతా రాజకీయాలపై ప్రాక్టికల్ గా అనుభవం లేని వాళ్లే. బుక్కిష్ నాలెడ్జ్ తో .. కార్పొరేట్ కంపెనీ వ్యవహారాలు నడిపినట్లుగా నడుపుతూ ఉంటారు. వారి వల్ల అయ్యేదేమీ ఉండదు. మాస్ పవర్ ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ కార్యకర్తల్ని .. సోషల్ మీడియా సైన్యంగా మార్చుకోవడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.
భారీ ఖర్చుతో ఇంపాక్ట్ చూపిస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా
భారత రాష్ట్ర సమితి అధికారం పోయాక.. సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసుకుంది. వందల మంది కార్యకర్తలను రిక్రూట్ చేసుకుంది. బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా పెడుతుంది. ఆ ఆర్థిక సామర్థ్యం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. సాధారణంగా తమ పార్టీ నేతలు పోస్టు పెడితే ఇతర పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు పాజిటివ్ ట్వీట్లు పెట్టరు.కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇతరుల్ని విమర్శించడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. తమ పార్టీ నేతల్ని పొగడటానికి.. ఆయా పోస్టును వైరల్ చేయడానికి సమయం కేటాయిస్తారు. అందుకే సోషల్ మీడియాలో ముందుంది అన్న అభిప్రాయం కలుగుతుంది.
కానీ ఓటర్లపై ప్రభావం ఎంత ?
అయితే సోషల్ మీడియా పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. జరుగుతోంది మాత్రం జూబ్లిహిల్స్ ఉపఎన్నిక. సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకుని మేమే గెలిచేస్తున్నాం అనే భావనలో ఉంటే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే జూబ్లిహిల్స్ ఓటర్లలో ఆ హైప్ రావాలి కానీ బయట వస్తే ప్రయోజనం ఉండదు. జూబ్లిహిల్స్ నియోజకవర్గం మాస్ ఏరియా. అక్కడ సోషల్ మీడియా ప్రచారాలు ప్రభావం చూపిస్తాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఉపఎన్నికల్లో సోషల్ మీడియా హైప్ అసలు పని చేయకపోవచ్చు. కానీ బీఆర్ఎస్ మాత్రం అదే నమ్ముతోంది. ఇప్పటికైతే సోషల్ మీడియా ప్రచారంలో బీఆర్ఎస్ ముందు ఉంది.. గ్రౌండ్ లెవల్ లో పోటాపోటీగా ప్రచారం చేస్తోంది. మరి ఫలితం ఎలా ఉంటుందో ?