జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో గెలిచేస్తామని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది. లేనిపోని సర్వేలను రంగంలోకి దించింది. దీంతో జూబ్లిహిల్స్ బయట కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని బీఆర్ఎస్ గెలుస్తుందన్న ప్రచారం ప్రారంభమయింది. ముఖ్యంగా నెటిజన్లలో ఈ టాపిక్ ఎక్కువగా చర్చ జరిగింది. అలా చర్చించేలా బీఆర్ఎస్ చేయగలిగింది. కానీ ట్విట్టర్ హైప్.. ఎన్నికల్లో ప్రభావం చూపదని మరోసారి స్పష్టమయింది.
భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ సీట్ కావొచ్చు కానీ గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడానికి ప్రధాన కారణం మజ్లిస్ పార్టీ. ఆ పార్టీ సహకారం వల్లనే గోపీనాథ్ బీఆర్ఎస్ తరపునరెండు సార్లు గెలిచారు. మొదటి సారి టీడీపీ తరపున గెలవడానికి కూడా మజ్లిసే కారణం. అప్పుడు మజ్లిస్ తరపున నవీన్ యాదవ్ పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చి రెండో స్థానంలో నిలిచారు. ఈ సమీకరణాలతో పాటు గత ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లోకల్ క్యాడర్ పార్టీ మారిపోయింది.
అదే సమయంలో ఉపఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవడం చిన్న విషయం కాదు. అలాంటి పరిస్థితి .. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే వచ్చే అవకాశం ఉండదు. గతంలో బీఆర్ఎస్ కూడా ఉపఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించింది. అయితే బీఆర్ఎస్ గట్టి ప్రయత్నం చేసింది కానీ అది గ్రౌండ్ లో కంటే.. సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంది. అందుకే బీఆర్ఎస్ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. సోషల్ మీడియా కన్నా.. ఇప్పుడు బీఆర్ఎస్ గ్రౌండ్ లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

