భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా టీమ్ జాగృతి ట్రాప్లో పడినట్లుగా కనిపిస్తోంది. కవితను బీఆర్ఎస్ టీం టార్గెట్ చేసేలా చేసిన జాగృతి టీం.. ఇప్పుడు ఎదురుదాడికి దిగుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ టీం స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడిం సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ యుద్ధం ఇప్పుడు పరాకాష్టకు చేరింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు కవితను లక్ష్యంగా చేసుకుని ఏకపక్షంగా దాడులు చేస్తుంటే, ప్రతిస్పందనగా తెలంగాణ జాగృతి సోషల్ మీడియా బృందాలు కూడా బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రచారం చేస్తున్నాయి.
బీఆర్ఎస్ సైన్యం అతి చేస్తే కవితకే రాజకీయ ప్రయోజనం
బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం చేస్తున్న అతి, కవితకు రాజకీయంగా మేలు చేసేలా కనిపిస్తోంది. కవితను వ్యక్తిగతంగా దూషించడం, ఆమె కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటివి సామాన్య ప్రజల్లో ఆమె పట్ల సానుభూతిని పెంచుతున్నాయి. ఒక ఆడబిడ్డపై ఇంతలా దాడి చేయాలా అన్న భావన తెలంగాణ సమాజంలో మొదలైంది. ఫలితంగా, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు పార్టీకి క్షేత్రస్థాయిలో మేలు చేయడం కంటే నష్టమే ఎక్కువగా చేకూరుస్తున్నాయి.
మరింత రెచ్చగొడున్న జాగృతి టీం
మరోవైపు, కవిత నేతృత్వంలోని జాగృతి సోషల్ మీడియా టీం ఇప్పుడు వెనక్కి తగ్గడం లేదు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని, ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన లోపాలను కవిత శాసన మండలి సాక్షిగా బయటపెట్టిన తీరును జాగృతి బృందాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పేరు మార్పు మొదలుకుని, తెలంగాణ అస్తిత్వాన్ని పక్కన పెట్టడం వరకు ప్రతి అంశంలోనూ గులాబీ పార్టీని ఇరుకున పెట్టేలా పోస్టులు పెడుతున్నారు. ఇది కేడర్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. సోషల్ మీడియాను చూసే వ్యక్తులపై అవినీతి ఆరోపణలు కూడా చేస్తూ వారు స్పందించేలా చేసుకుంటున్నారు.
కవిత పట్ల సానుభూతి పవనాలు:
ఇటీవల శాసన మండలిలో కవిత కన్నీరు పెట్టుకోవడం, తనపై జరుగుతున్న కుట్రలను వివరించడం ఆమెకు సోషల్ మీడియాలో భారీ మద్దతును తెచ్చిపెట్టింది. బీజేపీ వేధింపులకు తోడు, ఇప్పుడు కన్న తండ్రి పార్టీ కూడా తనను వేధిస్తోందనే విక్టిమ్ కార్డ్ ఆమెకు బాగా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఏకపక్ష దాడులు ఆమెను రాజకీయంగా దెబ్బతీయడం కంటే, ఒక పోరాట యోధురాలిగా ప్రజల ముందు నిలబెడుతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే, రాబోయే రోజుల్లో కవిత స్థాపించబోయే కొత్త రాజకీయ పక్షానికి ఈ సానుభూతి బీఆర్ఎస్కు సమస్యగా మారడం ఖాయమని అనుకోవచ్చు.


