బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. కేంద్రం కూడా డీపీఆర్‌ను వెనక్కి పంపింది. దీంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లయింది. బీఆర్ఎస్కు రాజకీయ ఆయుధం పోయినట్లయింది.అయితే ఇలాంటి ఆయుధాలు తాము చాలా సృష్టించుకోగమని బీఆర్ఎస్ మరోసారి నిరూపించింది. ఆ పార్టీ నేత హరీష్ రావు మీడియా సమావేశం పెట్టి నల్లమల సాగర్ అనే ప్రాజెక్టును ఏపీ చేపడుతోందని ఇది బనకచర్ల కంటే డేంజరని.. ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తోందని ఆరోపించేశారు.
నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని, ముఖ్యంగా కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును తాము జలయుద్ధానికి ముడిసరుకుగా వాడుకుంటున్న పాలమూరు-రంగారెడ్డి పథకానికే లింక్ పెట్టారు. ఈ పథకం ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు అందాల్సిన నీటి వాటాను ఏపీ ప్రభుత్వం లాగేసుకునే ప్రయత్నం చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా స్పందించడం లేదని, రాష్ట్ర హక్కులను కాపాడటంలో విఫలమవుతోందని ఆయన విమర్శించారు.ఇదే అసలు లైన్.
శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ను వాడుకునేందుకు దోర్నాల – ఆత్మకూరు మధ్య ఉన్న లోతట్టు ప్రాంతాలను కలుపుతూ ప్రాజెక్ట్ నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. నల్లమల కొండల మధ్య ఉన్న సహజసిద్ధమైన లోయలను వాడుకుంటూ, భారీ కట్టడాల ద్వారా నీటిని నిల్వ చేసేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వరద నీటిని ఈ నల్లమల సాగర్‌కు తరలించాలని ప్లాన్ చేస్తున్నారు. కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు వృథాగా సముద్రంలోకి వెళ్లే నీటిని ఇక్కడ నిల్వ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇంకా ఇది డీపీఆర్ వరకూ రాలేదు.
దిగువరాష్ట్రమైన ఏపీకి..తెలంగాణ నిల్వ చేసుకోగలిగినన్ని నీళ్లు నిల్వ చేసుకున్న తర్వాతనే కిందకు వదులుతుంది. ఏపీ నుంచి నీళ్లు సముద్రంలోకి పోవాల్సిందే. ఆ నీటిని ఆపుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసుకుటూంటే తెలంగాణకు అన్యాయం బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
