బాలీవుడ్ బడా బాబులంతా ఈమధ్య సౌత్ ఇండియన్ డైరెక్టర్లపై గురి పెట్టాడు. షారుఖ్ ఖాన్ అయితే అట్టీతో ‘జవాన్’ తీసి సూపర్ హిట్టు కొట్టాడు. ఆ సినిమా షారుఖ్ కి సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. ఇప్పుడు మరోసారి షారుఖ్ మన దర్శకులపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన దృష్టి.. బుచ్చిబాబుపై పడిందన్నది ముంబై వర్గాల టాక్. ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘పెద్ది’ తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు. ఆ తరవాత… షారుఖ్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కూడా మైత్రీలోనే ఉండే అవకాశం ఉంది. మైత్రీ మూవీస్ షారుఖ్ తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. సుకుమార్ సపోర్ట్ తోనే.. ఈ కథ షారుఖ్ వరకూ వెళ్లిందని, షారుఖ్ కూడా ఈ సినిమాపై ఆసక్తిని కనబరుస్తున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘పెద్ది’ హిట్టయితే.. బుచ్చితో సినిమా చేయడానికి షారుఖ్ కి ఎలాంటి అభ్యంతరాలూ ఉండకపోవొచ్చు. బుచ్చి కి కూడా `పెద్ది`తో సక్సెస్ అయితే తన కెరీర్ గ్రాఫ్ ఎలా మారిపోతుందుదో ఓ ఐడియా వుంది. అందుకే ఈ సినిమాపై గట్టిగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. బుచ్చిబాబు కథలు రూటెడ్ గానే ఉంటాయి. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సాగుతుంటాయి. షారుఖ్ కోసం కూడా అలాంటి కథే రెడీ చేశాడని సమాచారం.
ఇప్పటి వరకూ వచ్చిన అవుట్ పుట్ సినిమాపై అంచనాలు పెంచేలానే వుంది. ‘చికిరి’ పాటైతే… సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. డిసెంబరులో పెద్దికి సంబంధించిన మరో పాట పాబోతోంది. చరణ్ – జాన్వీలపై రెహమాన్ స్వరపరిచిన డ్యూయెట్ కూడా వేరే రేంజ్లో ఉండబోతోందని తెలుస్తోంది. 2026 వేసవిలో ‘పెద్ది’ విడుదల కానుంది.


