ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. గురువారం నుంచి అంటే.. పదకొండో తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. పన్నెండో తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సమయంలోనే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో… ప్రజలకు చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే… ఆయన విడిగా ప్రెస్‌మీట్ పెట్టి.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై.. శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు.. ఆ ప్రకటన నేడు చేయనున్నారు.
అన్నీ అసెంబ్లీలో.. ఆర్థికశాఖపై మాత్రం బయట రిలీజ్..!
ప్రభుత్వం ఏర్పడి నెలరన్న అవుతోంది. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి.. అన్ని శాఖల అధికారులతో.. సమీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో.. సమీక్ష చేసినప్పుడల్లా.. ప్రతీ శాఖకు సంబంధించిన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుందని ప్రచారం చేశారు. కానీ అలాంటి పత్రాలేమీ విడుదల చేయలేదు. అయితే.. అసెంబ్లీలోనే.. ఈ పత్రాలన్నీ విడుదల చేస్తామని.. రంగాల వారీగా.. ఏపీని తెలుగుదేశం ప్రభుత్వం.. ఎంత దుర్భర స్థితిలోకి తీసుకెళ్లిందో చెబుతామని.. ఇప్పుడు చెబుతున్నారు. అయితే.. ఇందులోనూ ఓ మినహాయింపు ఇచ్చి.. ఆర్థిక శాఖపై శ్వేతపత్రాన్ని మత్రం.. అసెంబ్లీలో కాకుండా.. ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
టీడీపీ హయాంలో ఆర్థిక అవకతవకలు బయటపెడతారా..?
ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌తో ఏర్పడింది. కేంద్రం నుంచి అందిన అరకొర సాయంతోనే నడిచింది. ఇప్పటికీ పరిస్థితులు ఏ మాత్రం మెరుగుపడలేదు. కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా… ఇతర పథకాల కోసం నిధులు వెచ్చించాలన్నా.. అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వం… ఎంత అప్పు పుడితే అంత అప్పు చేసింది. వాటితో ప్రాజెక్టులు అమలు చేయడం.. సంక్షేమ పథకాలకు మళ్లించడం వంటి పనులు చేసింది. కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరే పెట్టుకోవడంతో… వాటికి మరిన్ని నిధులు అవసరమవుతున్నాయి. దీంతో.. కొన్నింటికీ నిధులు తగ్గించక తప్పదని.. ఆ విమర్శలు రాకుండా.. ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాలనకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
పథకాలు, ప్రాజెక్టులకు నిధులు తగ్గించేందుకు సాకా..?
ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. చెప్పి నవరత్నాలకు.. పరిమితులు విధించడం.. ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులకు.. నిధుల కోత విధిస్తే.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. గతంలోనూ.. చంద్రబాబు ఇంత కంటే దుర్భర పరిస్థితుల్లోనే ఏపీ సీఎం అయ్యారనే వాదన టీడీపీ తెరపైకి తీసుకు వస్తుంది. ఆర్థిక పరిస్థితి గురించి ఏపీ ప్రజలకు వివరించడం మంచిదే కానీ.. ఈ విషయాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని.. తమ లక్ష్యాలను.. కుదించుకోకూడదని… వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు. మరి.. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే.. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం ప్రకటించి.. బుగ్గన .. ఏం సాధించదల్చుకున్నారో.. ఆయన విడుదల చేసే పత్రంతో తేలిపోతుంది.