రివ్యూ: బుర్ర క‌థ‌

తెలుగు360 రేటింగ్ : 1.5/5

ప‌ది బంతుల్లో ముఫ్ఫై ప‌రుగులు చేయాల‌న్న‌ప్పుడు మ్యాచ్ మ‌జా వ‌స్తుంది
అదే… ఆరు బంతుల్లో అర‌వై కొట్టాల‌నుకుంటే
ముందే టీవీ ఆఫ్ చేసి బొజ్జోవాల‌నిపిస్తుంది.
సినిమా చూస్తున్న‌ప్పుడు కూడా ఓ ఇంట్ర‌స్ట్ ఉండాలి. త‌ర‌వాతేం జ‌రుగుతుంది? మ‌న ఊహ‌ల్ని ద‌ర్శ‌కుడు నిజం చేస్తాడా? లేదంటే స‌రికొత్త ట్విస్టు ఇస్తాడా? అని చివ‌రి వ‌ర‌కూ ఎదురుచూసేలా చేయాలి.

కొన్ని సినిమాలుంటాయి. తొలి సీన్‌కే జాత‌కం అర్థ‌మైపోతుంది. క‌థ ఎలా న‌డుస్తుందో, ద‌ర్శ‌కుడు ఏం చేయ‌గ‌ల‌డో అర్థ‌మైపోతుంది. ఆ త‌ర‌వాత, ఇక త‌ప్ప‌ద‌న్న‌ట్టు, టికెట్ కొన్న పాపానికి ఆ సినిమాని చివ‌రి వ‌ర‌కూ భ‌రించాల్సివ‌స్తుంది. అలాంటి సినిమాల గురించి చెప్పాల‌నుంటే అందులో `బుర్ర క‌థ‌` పేరు త‌ప్ప‌కుండా ఉంటుంది.

అత‌ని పేరు అభిరామ్‌. రెండు బుర్ర‌ల‌తో పుట్టేశాడు. అభి ప‌క్కా మాస్ గా ఆలోచిస్తే, రామ్ క్లాస్‌. ఒక‌డికి ముద్ద ప‌ప్పు కావాలి. ఇంకొక‌డికి ముక్క కావాలి. ఒక‌డు బీర్ తాగుతాడు. మ‌రొక‌డు మిల్కీ బోయ్‌. ఒక‌డు అమ్మాయి వెంట ప‌డ‌తాడు. ఇంకొక‌డు స‌న్యాసం తీసుకోవాల‌నుకుంటాడు. ఇలా… ఒక్క‌డే రెండు ర‌కాలుగా ప్ర‌వ‌ర్తిస్తుంటాడు. అభి.. హ్యాపీ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. రామ్ మాత్రం స‌న్యాసం తీసుకోవాల‌ని డిసైడ్ అవుతాడు. మ‌రి రామ్ స‌న్యాసం మానేసి – హ్యాపీ ప్రేమ‌లో ఎలా ప‌డ్డాడు? అభి, రామ్‌.. ఇద్ద‌రూ ఒకేలా ఎప్పుడు ఆలోచించ‌డం మొద‌లెట్టారు? అనేదే బుర్ర క‌థ‌.

మ‌నిషి ఒక్క‌డే – కానీ బుర్ర‌లు రెండు. ఇదీ బుర్ర క‌థ కాన్సెప్టు. ఒక ఫోన్‌లో రెండు సిమ్ముల‌న్న మాట‌. ఓ సిమ్‌తో మాట్లాడుతున్న‌ప్పుడు రెండో సిమ్ ప‌నిచేయ‌దు క‌దా? అలా ఓ బుర్ర ఆన్‌లో ఉంటే రెండోది ఆఫ్ అయిపోతుంది. దీని చుట్టూ ఓ క‌థ అల్లుకోవాల‌న్న ఆలోచ‌న వచ్చింది డైమండ్ ర‌త్న‌బాబుకి. థాట్ మంచిదే కానీ థియ‌రీ కూడా తెలిసుండాలి. ఇదో చిక్కుముడుల క‌థ‌. దాన్ని తెలివిగా ఎలా చెప్పాలి? ఆస‌క్తిగా ఎలాంటి స‌న్నివేశాలు రాసుకోవాలి? అనే విష‌యంలో డైమండ్ ర‌త్న‌బాబులోని ద‌ర్శ‌కుడు క‌మ్ ర‌చ‌యిత ఇద్ద‌రూ జాయింటుగా విఫ‌ల‌మ‌య్యారు. తొలి సీన్‌లోనే – అభి రామ్‌ల మేట‌రేంటో అర్థ‌మైపోతుంది. ఇద్ద‌రిలో ఉన్న వైవిధ్యం గురించి చెప్ప‌డానికి ఒక్క సీన్ చాలు. అది బ‌లంగా రిజిస్ట‌ర్ అయిపోవాల‌ని సీన్ల మీద సీన్లు రాసుకుంటూ వెళ్లారు. కాక‌పోతే… ఒక్క‌టీ పేల‌లేదు. క‌థ‌లో ద‌మ్ములేద‌ని తెలిసిన‌ప్పుడే పేర‌డీలు, గార‌డీలూ చేయాల‌నిపిస్తుంది. ఫృథ్వీ చేత పాత సినిమాల డైలాగులు పలికించినా, మహేష్ నుంచి చిరంజీవి వ‌ర‌కూ హీరోలంద‌రినీ వాడేసినా – ఇంకేం ఇంకే ఇంకేం కావాలే.. అంటూ పాట‌ల్ని ఖూనీ చేసినా అందుకోస‌మే.

ఒక్క స‌న్నివేశానికీ ల‌క్ష్య సిద్ధి ఉండ‌దు. అన్నీ టైమ్ పాస్ వ్య‌వ‌హారాలే. అస‌లు ఒక‌డు ఇద్ద‌రిలా ఆలోచించ‌డం ఏమిటో? అర్థం కాదు. పోనీ.. దాన్ని అర్థ‌మ‌య్యేలానూ చెప్ప‌లేదు. మ‌ధ్య‌లో విల‌న్ గోలొక‌టి. అస‌లు విల‌న్‌కీ, ఈ బుర్ర క‌థ‌కీ. ఏమైనా సంబంధం ఉందా? అనిపిస్తుంది. ఆది ఫైట్లు కావాలి.. అని అడిగి ఉంటాడు. అందుకే విల‌న్ ట్రాక్‌ని అతికించిన‌ట్టు అనిపిస్తుంది. విల‌న్ల‌ను బ‌ఫూన్ల‌గా చూపిస్తే కామెడీ వర్క‌వుట్ అవుతుంద‌నుకోవ‌డం పొర‌పాటు. హీరో, విల‌న్‌, హీరోయిన్ ఇలా ప్ర‌తీ పాత్ర‌నీ కొత్త‌గా డిజైన్ చేయాల‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు. మంచిదే. కానీ ఆ కొత్త‌ద‌నం కాస్త బెడ‌సికొట్టింది. `వ‌న్ అవ‌ర్ మ‌ద‌ర్ థెరీస్సా` ఏంటో, ఆమె చేసే సేవ‌లేంటో.. సిల్లీగాఉంటాయి. “న‌న్ను ప్రేమించ‌డం కూడా సేవ చేయ‌డ‌మే“ అని హీరో అంటే – స‌రే ఓ గంట ప్రేమించుకో అని చెప్ప‌డం ఏమిటో అర్థం కాదు. ఫృథ్వీ కామెడీ, ఛ‌మ‌క్ చంద్ర ఎపిసోడ్ రెండూ వెగ‌టు పుట్టిస్తుంటాయి. క‌థ రాసుకోకుండా.. ఈ సీను బాగుంటుందేమో, అది బాగోక‌పోయినా ఇది బాగుంటుందేమో అనుకుని, సీన్ల‌మీద సీన్లు రాసుకుంటూ వెళ్లారు. దాంతో సినిమా అంతా అతుకుల బొంత‌లా మారిపోయింది.

ఆదిలో ఎన‌ర్జీ ఉంది. దాన్ని చూపించే క‌థ మాత్రం కాదిది. రెండు పాత్ర‌ల్లో వైవిధ్యం చూసి ఆది ఈ సినిమా ఒప్పుకుని ఉంటాడు. అస‌లు క‌థే బోల్తా కొట్టేశాక‌.. ఇక ఏ పాత్ర అయినా ఎలా నిల‌బ‌డుతుంది? రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఫృథ్వీ, పోసాని అంతా వీర లెవిల్లో ఓవ‌రాక్ష‌న్ చేసుకుంటూ వెళ్లారు. ఇక విల‌నిజం గురించి చెప్ప‌క్క‌ర్లెద్దు. అరుపులు, కేక‌లు అన‌వ‌స‌ర‌పు హంగామా.

బ‌డ్జెట్ ప‌రిమితులు ఈ సినిమాలో అడుగ‌డుగునా క‌నిపించాయి. పాట‌లు వ‌చ్చిన‌ప్పుడే ప్రేక్ష‌కులు రిలాక్స్ అవుతారు. అలాగ‌ని అవేవో అదిరిపోయాయ‌ని కాదు. ఆ పేరు చెప్పి అప్పుడ‌ప్పుడూ బ‌య‌ట‌కు వెళ్లిరావ‌డానికి అనుకూలంగా ఉంటుంద‌ని. ఈ సినిమాకి క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డైమండ్ ర‌త్న‌బాబు అన్ని విభాగాల్లోనూ విఫ‌లం అయ్యాడు. మాటల్లో కావాల‌సి రాసిన పంచ్‌లు, ప్రాస‌లు క‌నిపిస్తాయి.

సినిమా అనేది బుర్ర పెట్టి తీయాలి. ఇలా బుర్ర‌ల‌తో ఆడుకోకూడ‌దు. ఆడుకుంటే ఏం జ‌రుగుతుందో చెప్ప‌డానికి `బుర్ర క‌థ‌` ఓ ఉదాహ‌ర‌ణ‌.

ఫినిషింగ్ ట‌చ్‌: బుర్ర ఇంకా ఎద‌గ‌లేదు

తెలుగు360 రేటింగ్ : 1.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com