హైదరాబాద్‌లోని ఆరో రియాల్టీ కంపెనీకి చెందిన ఆరో కోహినూర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సంచలన తీర్పునిచ్చింది. ఒక గృహ కొనుగోలుదారుడికి అనుకూలంగా 15 రోజుల్లోగా సేల్ అగ్రిమెంట్ పూర్తి చేయాలని రెరా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీని బాధితుడు ఫిర్యాదు చేసిన అతి తక్కువ కాలంలోనే ఈ స్పష్టమైన ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గచ్చిబౌలికి చెందిన సంజీవ్ మట్టూ అనే వ్యక్తి ఖానామెట్‌లోని ఆరో కోహినూర్ ప్రాజెక్టులో ఒక ఫ్లాట్‌ను బుక్ చేసుకున్నారు. దీని మొత్తం విలువ సుమారు రూ. 2.34 కోట్లు కాగా, ప్రాథమికంగా 10 శాతం మొత్తాన్ని కూడా చెల్లించారు. అయితే, బిల్డర్ ఒప్పందం ప్రకారం సేల్ అగ్రిమెంట్ చేయకుండా జాప్యం చేస్తున్నారని, అదనంగా నగదు డిమాండ్ చేస్తున్నారని సదరు కొనుగోలుదారుడు రెరాను ఆశ్రయించారు. హోమ్ లోన్ పొందడానికి ఈ అగ్రిమెంట్ తప్పనిసరి అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన ఆరో రియాల్టీ, కొనుగోలుదారుడి గుర్తింపు విషయంలో తలెత్తిన గందరగోళం వల్లే జాప్యం జరిగిందని వాదించింది. ఫిర్యాదుదారుడి పేరు మీద నేరుగా చెల్లింపులు జరగలేదని, వారి కంపెనీ పేరు మీద జరిగాయని పేర్కొంది. అయితే, ఇరు పక్షాల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన రెరా అథారిటీ, బిల్డర్ వాదనను తోసిపుచ్చింది. నిబంధనల ప్రకారం చెల్లింపులు జరిగిన తర్వాత ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాల్సిన బాధ్యత బిల్డర్దేనని స్పష్టం చేసింది.
ఈ తీర్పు వెలువడిన 15 రోజుల్లోగా ఎటువంటి అదనపు డిమాండ్లు లేకుండా సేల్ అగ్రిమెంట్‌ను పూర్తి చేయాలని రెరా ఆదేశించింది.
రియల్ ఎస్టేట్ చట్టం నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదని హెచ్చరించింది. అరబిందో గ్రూపునకు చెందిన శరత్ చంద్రారెడ్డికి చెందినది ఆరో రియాలిటీ. మొదటిలో అరబిందో రియాలిటీ పేరుతో ఉండేది. తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసు పరిణామాలతో దాన్ని ఆరో రియాలిటీగా మార్చారు.
