హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ ముసుగులో జరిగిన మరో అతిపెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. త్రిపుర కన్స్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పసుపులేటి సుధాకర్, ఆయన భార్య సుగుణ మరికొందరు కలిసి అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో సామాన్యుల నుండి వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రధానంగా సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ ప్రాంతంలో త్రిపుర నిర్వాణ వంటి భారీ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులను నిర్మిస్తామంటూ వీరు ప్రచారం చేశారు. 12 ఎకరాల్లో వెయ్యికి పైగా ఫ్లాట్లు, అత్యాధునిక సౌకర్యాలతో క్లబ్ హౌస్ నిర్మిస్తామని నమ్మించి మధ్యతరగతి ప్రజలను ఆకర్షించారు.
ఈ మోసం ప్రధానంగా ప్రీ-లాంచ్ ఆఫర్ల ద్వారా జరిగింది. ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ, మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామని వీరు ఆఫర్ చేశారు. ఉదాహరణకు, 2,200 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కేవలం 77 లక్షలకే ఇస్తామని ఒప్పందాలు చేసుకున్నారు. సుమారు మూడు ఏళ్ల క్రితం భూమి పూజ నిర్వహించి, 2026 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ నిర్మాణం ప్రారంభం కాకపోగా, కనీసం లేఅవుట్ అనుమతులు కూడా తీసుకోలేదని బాధితులు గుర్తించారు.
బాధితులు తమ సొమ్మును తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు, యాజమాన్యం బెదిరింపులకు పాల్పడ్డారు. సదరు ప్రాజెక్ట్ భూమిని మరొక కంపెనీకి బదలాయించే ప్రయత్నాలు చేస్తూ, కార్యాలయాలను మార్చేస్తూ వినియోగదారులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కేవలం పదిమంది బాధితుల నుండే దాదాపు 5.68 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రాథమికంగా తేలగా, మొత్తం బాధితుల సంఖ్య వందల్లో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
RERA అనుమతి లేని ప్రాజెక్టులలో, ప్రీ-లాంచ్ ఆఫర్లలో పెట్టుబడి పెట్టడం వల్ల ఇలాంటి భారీ నష్టాలు కలిగే అవకాశం ఉందని, ఏదైనా ప్రాజెక్ట్ బుక్ చేసే ముందు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అదేపనిగా ప్రచారం చేస్తున్నా తక్కువకు ఇస్తున్నారన్న కారణంగాకొంత మంది ఆశపడుతున్నారు. ఫలితంగా తాము జీవితాంతం శ్రమ చేసి సంపాదించుకున్న సొమ్మును కోల్పోతున్నారు.
