ఈపాట రా`సినారె’

డాక్టర్ సి.నారాయణరెడ్డి జన్మదిన ప్రత్యేకం:

కొన్ని పాటలు వింటుండగానే ఆపాట ఎవరు రాశారో వింటున్న శ్రోతలకు తెలిసిపోతుంది. అది ఆ రచయిత గొప్పతనం. ఇవెందుకు చెబుతున్నానంటే, మాఊర్లో కాలేజీలో చదువుతున్నప్పుడు ఓసారి పాటలపోటీ పెట్టారు. మా క్లాస్ లోని ఒకరిద్దరు కూడా ఈ పోటీలో పాల్గొన్నారు. అందులో అబ్బాస్ అనే మిత్రుడు `వగలరాణివి నీవే సొగసుకాడను నేనే’ అంటూ పాట అందుకున్నాడు. ఈ పాట అతనికి అతికినట్టు అనిపించింది. నిజంగానే అందగాడు అతను. సరే, ఈ పాట అయిన తర్వాత తెలుగు మాస్టారు వాడిని పిలిచి `ఒరేయ్, ఈ పాట రాసింది ఎవర్రా ? ‘ అని అడిగారు. అతను చెప్పలేకపోయాడు. వెంటనే నేను లేచి , `సినారె..సినారె ‘అంటూ ఆనందంతో అరిచేశాను. దీంతో తెలుగు మాస్టారు సంతోషించి, మరి సినారె అంటే ? అడిగారు. నేను వెంటనే సి. నారాయణరెడ్డిగారు సార్. బాగా రాస్తారు అంటూ చాలా ఉత్సాహంగా నాకు తెలిసింది చెప్పేశాను. మాస్టారు ఓ నవ్వునవ్వి – `భలేవాడివిరా, ఆయనకు నువ్వు కితాబు ఇచ్చేటంతటి వాడివిరా… ‘ అంటూ భుజంతట్టారు.

ఇవ్వాళ ఈ సంఘటన ఎందుకు గుర్తుకువచ్చిందంటే, సినారె జన్మదినం కాబట్టి. మొదటి నుంచీ ఆయన రాసిన పాటలు నాకు బాగా ఇష్టం. గులేబకావళి కథ సినిమా మా ఊర్లో భారత్ టాకీస్ లో చూశాను. `నన్ను దోచుకుందువటే, వన్నెల దొరసాని ‘ అంటూ తెరపై ఎన్టీఆర్ పాడుతుంటే హాల్లో ఈలలు, తప్పట్లు. సినిమా చూస్తున్నప్పుడు ఈపాటలోఎన్టీఆర్ కనబడితే, అదే రేడియో పెట్టెలో ఈ పాట వస్తుంటే మాత్రం ఘంటసాల వినిపిస్తూ కనిపించేవారు. అప్పట్లో గాయకులు ఎప్పుడోగానీ కనబడేవారుకాదు. దీంతో సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ పాడుతుంటే అది వారి గొంతే అనుకునేవారు. అంతగా అగ్రహీరోలకు తగ్గట్టుగా పాటలు పాడేవారు ఘంటసాలగారు.

హైదరాబాద్ లో అధ్యాపక వృత్తిలో ఉన్న నారాయణరెడ్డిగారిని ఎన్టీఆర్ మద్రాసుకు రమ్మనమని కబురుపెట్టారు. అలా వెళ్లగానే గులేబకావళి కథ చిత్రానికి పాటలు రాయమన్నారు. సినారె సరే అన్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ లో పాఠాలు, మద్రాసులో పాటలతో ఆయన చాలా బిజీ అయ్యారు. ఆయన ఎన్ని పాటలు రాశారో నేను లెక్కపెట్టలేదుగానీ, సుమారు 3500 పాటలు రాశారని చెబుతుంటారు.

1970 ప్రాంతంలో ఎన్టీఆర్ తన సొంత బ్యానర్ మీద తల్లా పెళ్ళామా ? అనే చిత్రం తీశారు. ఈ సినిమాలో ఆనాటి తెలంగాణ సమస్యపై ఒక పాట రాయించారు. `తెలుగుజాతి మనది, నిండుగా వెలుగుజాతి మనది’ – అన్నది ఈ పాట. సంగీత దర్శకుడు టి.వి రాజు ఈపాటకోసం నాలుగు ట్యూన్లు కట్టారు. వీటిలో ఏ ట్యూన్ నిర్మాత ఎన్. తివిక్రమరావుగారికి నచ్చలేదు. పాట ట్యూన్ ఎలా ఉండాలంటే, హీరో తన కాలేజీ ఫంక్షన్ లో పాడుతుంటే, సీట్లో కూర్చున్నవారంతా రోమాంచితులైపోవాలి…అలా ఉండాలని సలహా ఇచ్చారు. చివరకు ఒక ట్యూన్ ఎన్టీఆర్ కి బాగా నచ్చింది. ఎంతగా అంటే, ఆ పాటలో కొన్ని పదాలకు ఆయనే వాయిస్ ఇచ్చేటంత.

ఈ పాటను తెలంగాణ వాడైన సినారె రాయడమేమిటని ఇప్పుడు ప్రశ్నించవచ్చు. అయితే, అప్పటి పరిస్థితులు, భావజాలాన్నిబట్టి ఆ పాట రాయాల్సివచ్చిందని సినారె ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే, 1968లో విడుదలైన వరకట్నం సినిమా గురించి కూడా చెప్పుకోవాలి. ఇది కూడా ఎన్టీఆర్ సొంత బ్యానర్ మీద విడుదలైందే. వరకట్న దురాచారంమీద సినారె ఎలుగెత్తి రాసిన పాట – `ఇదేనా మన సంప్రదాయమిదేనా….’ ఇప్పటికీ వింటుంటే ఆవేశం కట్టలుత్రెంచుకుంటుంది. ఘంటసాల అంతగా లీనమై ఈపాట పాడారు. దీనికి కూడా సంగీతం టి.వి.రాజుగారే అందించారు. వరకట్నం ఇవ్వలేదన్న సాకుగా పీటలమీద పెళ్ళి ఆగిపోయి వరుడు ఎడ్లబండిమీద వెళుతుండగా సాగే పాట ఇది. ఈ పాటలోనే టైటిల్స్ పడుతుంటాయి.

అలాగే నాకు సినారె గారు రాసిన పాటల్లో మరోపాట ఇప్పటికీ నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. అది కర్ణ సినిమాలోది. విశ్వనాథం రామ్మూర్తి సంగీతంలో సినారె రాసిన పాట – `గాలికి కులమేది ? ఏదీ నేలకు కులమేది?’ – అంటూ చాలా సరళమైన మాటలతో రాసిన పాట ఇది. `ప్రతిభకు కలదా స్థలబేధం, వీరుల కెందుకు కుల బేధం, అది మనసులు చీల్చెడు మతబేధం’ – అంటూ సాగే ఈపాట ఇప్పుడు మనం విన్నా మానసిక ధైర్యం కలగడం ఖాయం. సుశీలమ్మగారు పాడారు.

నారాయణరెడ్డిగారి పాటలు దేనికవే సాటి. `దాచాలంటే దాగవులే’ (లక్షాధికారి) , చెలికాడు నిన్నే రమ్మని పిలువ (కులగోత్రాలు), ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో (అమరశిల్పి జక్కన), అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి (బంగారు గాజులు) ఇలా ఎన్నో పాటలు సినారె అనగానే గుర్తుకువస్తాయి.

సి. నారాయణరెడ్డిగారి అసలు పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి. 1931 జులై 1931న జన్మించారు. 83ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ ఆయన సభలకూ, సమావేశాలకు హాజరవుతూ సాహితీ సేవ చేస్తూనే ఉన్నారు. మొన్నీమధ్యనే దాశరధి 91వ జయంతి సభలో సినారె పాల్గొన్నారు. ఆ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ, సినారెతో పోల్చదగిన కవులున్నారా ? అంటూ తనదైన శైలిలో ఏపీకి సవాలువిసిరారు.

సి.నారాయణరెడ్డిగారి పాటలు వింటూ మైమరచిపోయే నాకు ఆయన్ని కలవడం మూడుసార్లు తటస్థించింది. ఒక పుస్తకావిష్కరణ సభలో వారితో ముచ్చటించే అవకాశం రావడం ఒక ఎత్తైతే, ఆ తర్వాత `తరంగ’ (ఆన్ లైన్ రేడియో స్టేషన్) ఇంటర్వ్యూ కోసం వారిని ప్రత్యేకంగా రెండుసార్లు కలవడం జరిగింది. దాదాపు 45 నిమిషాలపాటు వారితో ఇంటర్వ్యూ రూపంలో ముచ్చటించడం ఓ అదృష్టం. అమాయకంగా నేను వేసిన ప్రశ్నలకు కూడా ఆయన చతురోక్తులతో సమాధానాలు చెప్పారు. `పంచకట్టుటలో నేనే ఇప్పటికీ మొనగాడి’నంటూ, తన అందం ఈనాటికీ చెక్కుచెదరలేదంటూ సరదాగా మాట్లాడారు సినారె. ఎప్పుడూ మల్లెపువ్వులా కనిపించే తెలుగువారి ముద్దుబిడ్డ సినారె మరిన్ని పుట్టినరోజువేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ – వారి అభిమాని….

– నాగభూషణరావు తుర్లపాటి (కణ్వస)
kanvasa19@gmail.com

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close