ఇంటర్నెట్ ఆపేస్తే “పౌరసత్వ దావానలం” ఆరిపోతుందా..?

అపోహలో… ఆందోళనో.. పౌరసత్వ బిల్లు, ఎన్నార్సీపై దేశవ్యాప్తంగా ఆందోళన పెరుగుతంది. హిందువుల్లోనూ.. తమ పౌరసత్వాన్ని నిరూపించుకవాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన పెరుగుతోంది. ముస్లింల సంగతి అయితే.. చెప్పాల్సిన పని లేదు. ఉత్తర భారతం అట్టుడుకుతోంది..! ఈశాన్యం మండిపోతోంది..! దక్షిణ భారతంలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి.. యావత్‌ భారతం ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు భగ్గుమంటున్నాయి. ఈశాన్యం.. అక్కడి నుంచి కోల్‌కతా.. ఢిల్లీ.. లక్నో.. ఇలా యావత్‌ దేశం విస్తరించాయి. పలు చోట్ల హింసాత్మకంగా మారాయి. కర్ణాటకలోనూ ఆందోళనల్లో ఇద్దరుచనిపోయారంటే పరిస్థితిని ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆందోళనలతో ఢిల్లీ మొత్తం స్తంభించిపోయింది.

ఆందోళనలు తగ్గించేందుకు కేంద్రం… కంటి తుడుపు ప్రయత్నాలు మాత్రమే చేస్తోంది. అధికారింగా… పౌరసత్వ బిల్లు వల్ల ఎవరికీ ఇబ్బంది లేదంటూ.. ఓ ఫ్యాక్ట్‌ షీట్‌ను విడుదల చేశారు. ఎవరికీ ఎలాంటి ఆందోళన వద్దంటూ అందులో సూచించారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ రెండూ వేర్వేరంటూ హోంశాఖ ఆ ఫ్యాక్ట్‌లో స్పష్టం చేసింది. కేంద్రం ఎంతగా చెబుతున్నా.. ఎవరూ నమ్మడం లేదు. ఈ ఆందోళనలు అణచి వేయడానికి కేంద్రం ఇంటర్నెట్‌ను నిలిపివేయడమే ఓ అస్త్రంగా వాడుకుంటోంది. ఆందోళనలు, ఘర్షణలు తలెత్తితే చాలు.. కాల్‌ కలవడం లేదు, ఇంటర్నెట్‌ పని చేయడం లేదు. దీంతో ఇబ్బంది తప్పడం లేదు. ప్రతి ఒక్కరికి అత్యవసరంగా మారిన ఫోన్‌ సర్వీసులు పదే పదే సస్పెండ్‌ చేస్తోంది. ఢిల్లీలో  ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో కేంద్రం ఢిల్లీలో టెలిఫోన్‌ సర్వీసులను నిలిపివేసింది. ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తిన ప్రతిసారి కేంద్రం టెలికాం సర్వీసులను నిలిపివేస్తోంది.సీఏఏ ఆందోళనలు మొదలైన సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో సేవలను నిలిపివేశారు. కానీ ఇప్పటికీ అక్కడ ఇంటర్నెట్‌ సర్వీసులు పునరుద్ధరణ కాకపోవడంతో.. కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

కశ్మీర్‌లో ఇప్పటికీ ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించలేదు.  కానీ ఇప్పుడు చిన్న చిన్న ఆందోళనలకు కూడా టెలికాం సేవలను నిలిపివేస్తున్నారు.  కశ్మీర్‌ సున్నితమైన ప్రాంతం.. పరిస్థితులు అదుపు తప్పకుండా ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేశారంటూ అర్థం ఉంది. కానీ ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఢిల్లీకి పాకడమే అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ప్రజా ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరిగాయన్న విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com