ఎన్నికలకు మరో 3 వారాలే మిగిలున్నాయి.టిడిపి, జనసేన ఇంకా పూర్తిస్థాయి అభ్యర్థులను ప్రకటించడం కోసం కసరత్తు చేస్తుంటే, వైఎస్సార్సీపీ మాత్రం అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈలోగానే జగన్ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న సాక్షి పత్రిక పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కథనాల మీద కథనాలు వెలువరిస్తోంది.
టిడిపి జనసేన పార్టీలు రెండు ఒకటే అని చెప్పడానికి సాక్షి ఒక వింత లాజిక్ వ్రాసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ బిఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, ఆ బీఎస్పీ సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి, ఆ సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది కాబట్టి, ఆ కాంగ్రెస్ తో టిడిపి సన్నిహితంగా ఉంది కాబట్టి, టిడిపి జనసేన పార్టీలు కూడా రెండు ఒకటే అంటూ విచిత్రమైన లాజిక్ ప్రవేశపెట్టింది. వైఎస్ఆర్సిపి, ఇటు కేసిఆర్ తోనూ అటు మోడీ తోనూ చెట్టా పట్టా లేసుకొని తిరుగుతూ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా వ్యవహరించడమే కాకుండా జనసేన మీద ఇలా అసత్య కథనాలు రాయడం ఏమిటని అంటూ నెటిజన్లు సాక్షి కథనం పై విరుచుకు పడుతున్నారు.
నిజానికి తెలుగుదేశం పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం 2018 మార్చిలో పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలు. అంతకు ముందు జగన్ మూడేళ్ల పాటు ఏవేవో చెబుతూ వచ్చినా ప్రజలు నమ్మకపోగా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ను, అటు నంద్యాల ఉప ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీని ఓటమి పాలు చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ తిరగబడ్డ తర్వాతే, రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడడం, దీంతో అప్పటికే ఎస్టాబ్లిషెడ్ అయి ఉన్న పార్టీగా వైఎస్సార్ సీపీ ఆ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని తన సొంత మీడియాలో ప్రొజెక్టు చేసుకోవడం కారణంగా వైఎస్ఆర్సిపి ఈ రోజు రాష్ట్రంలో బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది తప్పిస్తే, గత ఐదేళ్లలో పరోక్ష పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ లాంటి ఎన్నికలైనా, ప్రత్యక్ష పద్ధతిలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలైనా ఏ ఎన్నికల్లో కూడా ప్రజలు వైఎస్సార్సీపీని ఆదరించలేదు. అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా తమ పార్టీ గెలుస్తుందని భావిస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీ తో పాటు వారి సొంత పత్రిక సాక్షి కూడా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకుని తీవ్ర కథనాలను వెలువరిస్తోంది.
ఇప్పటికే ఇటు తెలుగుదేశం మీడియా జనసేన ను పూర్తిగా బ్యాన్ చేసిన దరిమిలా ఇటు సాక్షి కూడా తీవ్ర కథనాలను వండుతున్న నేపథ్యంలో కేవలం సోషల్ మీడియా ఆధారంగా చేసుకొని ఈ కథనాలను జనసేన అభిమానులు తిప్పికొడుతూ ఉన్నప్పటికీ, సాక్షి కథనాలను ఎంతోకొంత నమ్మే వారు ఉండడం వల్ల ఈ అసత్య కథనాలు జనసేన ఫలితాల ను ఏ మేరకు ప్రభావితం చేస్తాయి అన్న చర్చ నడుస్తోంది.