వ్యాన్‌పిక్ వ్యవహారంలో రాస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ , పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. రాస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఇరుపక్షాల అంగీకారంతో రిటైర్డ్ చీఫ్ జస్టిస్ యూయూ లలిత్‌ను ఏకైక మధ్యవర్తిగా నియమించింది. యూఏఈ కోర్టు ఇప్పటికే నిమ్మగడ్డ ప్రసాద్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన రూ. 500 కోట్ల రికవరీ డిక్రీని అమలు చేసే క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
డిపాజిట్లు, ఆస్తుల జప్తు
ఈ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ. 125 కోట్ల నగదును సెక్యూరిటీగా డిపాజిట్ చేశారు. దీనితో పాటు తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దేవరయాంజల్లో ఉన్న అత్యంత ఖరీదైన 37 ఎకరాల భూమికిసంబంధించిన ఒరిజినల్ పత్రాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ ఆస్తుల విలువ సుమారు రూ. 600 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మధ్యవర్తిత్వ ప్రక్రియ ముగిసే వరకు నిమ్మగడ్డ తన స్థిరాస్తులను ఎవరికీ బదలాయించకూడదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
క్విడ్ ప్రో కో కోణం
వ్యాన్‌పిక్ ప్రాజెక్టు కోసం రాకియా నుంచి సేకరించిన పెట్టుబడులను నిమ్మగడ్డ ప్రసాద్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్ మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించారనే ఆరోపణలు ఈ కేసులో ప్రధానాంశంగా ఉన్నాయి. సుమారు 120 మిలియన్ డాలర్ల నిధులను ప్రాజెక్టు అవసరాలకు కాకుండా ఇతర ప్రయోజనాలకు వాడారని రాకియా ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సీబీఐ , ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. సీబీఐ కోర్టులో కేసుల విచారణ ట్రయల్‌కు రావాల్సి ఉంది.
డబ్బులు ఇచ్చేస్తే వివాదం ముగించేందుకు రాకియా రెడీ
ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఉన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను కొనసాగించాలని జస్టిస్ యూయూ లలిత్‌ను కోర్టు కోరింది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తే వివాదాన్ని ముగించేందుకు రాకియా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మధ్యవర్తిత్వం విఫలమైతే, నిమ్మగడ్డ డిపాజిట్ చేసిన నగదు , భూములను రాకియాకు చెల్లింపుల కోసం కోర్టు వినియోగించే అవకాశం ఉంది.
