‘నాకు గంజీ తెలుసు……బేెంజీ తెలుసు’ అని మొదటి రాజకీయ సభలోనే అద్భుతమైన డైలాగులు పేల్చాడు చిరంజీవి. ఆ తర్వాత కూడా సామాజిక న్యాయం అంటూ పెద్ద పెద్ద మాటలెన్నో చెప్పాడు. రాజకీయ పార్టీలన్నింటిలోకి ముందుగా సమైక్యాంధ్ర ప్రదేశ్ అన్నది కూడా చిరంజీవి పార్టీనే. కానీ ఏం ఉపయోగం? అందరూ రాజకీయ నాయకుల్లాగే చిరంజీవి కూడా నినాదాలు, పంచ్ డైలాగులకు మాత్రమే తన రాజకీయాన్ని పరిమితం చేశాడు. చేతల్లో చూపించింది శూన్యం. దాదాపుగా దశాబ్ధపు రాజకీయ జీవితంలో భారీ సంఖ్యలో ప్రజలకు ఉపయోగపడిన ఈ పనిని నేను చేశాను అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేని రాజకీయ జీవితం చిరంజీవిది. అందుకే తనకు, తనను నమ్ముకున్న కొంతమంది నాయకులకు కూడా కొన్ని పదవులు, వాటితో వచ్చే సంపాదన మినహా రాజకీయంగా చిరంజీవి చేసింది శూన్యం. అందుకే చిరంజీవి రాజకీయ జీవితం ఫ్లాప్ సినిమాగా మిగిలిపోవడానికి పెద్దగా టైం పట్టలేదు.
ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు 150వ సినిమాతో రైతుల సమస్యలనే సాల్వ్ చేస్తానన్న చిరంజీవి కనీసం తెరపైన కూడా ఆ రైతుల కోసం నిజాయితీగా పోరాడే ప్రయత్నం చేయలేదు. రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నది ఎవరు? ప్రాజెక్టులని, అభివృద్ధి అని చెప్పి అవసరం లేకపోయినా, తక్కువ ఎకరాల స్థలంలోనే అవే అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉన్నా కూడా కార్పొరేట్ కంపెనీల మెప్పుకోసం, ఆమ్యామ్యాల కోసం, బడా బడా బిజినెస్ పీపుల్ ఇచ్చే ఎన్నికల నిధుల కోసం వేలాది ఎకరాలను వాళ్ళకు కట్టబెడుతున్నది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం రాజకీయాల పైన కనీస అవగాహన ఉన్న ఎవరైనా చెప్పగలరు. ఎన్నికల సమయంలో మాత్రం ముసలి, ముతక, బడుగు, బలహీన జనాలు, పేదలు, రైతులు, సామాన్యుల కోసమే పనిచేస్తాం అని చెప్పి తాయిలాలు ఆశచూపి గద్దెనెక్కే మన నాయకులు ఒకసారి పదవిని అధిష్టించగానే కాలినడకన తిరిగే వాళ్ళకు కడుదూరంగా…..కార్పొరేట్ ప్రపంచానికి క్లోజ్‌గా అయిపోతారు. రైతల పొట్టగొడుతూ బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి పొలాలు లాక్కుంటారు. అనుకూల మీడియాతో ఆ రైతుల ఆర్తనాదాలు వినిపించకుండా చేస్తారు. 144 సెక్షన్ విధించి మరీ భూములు ఇవ్వడానికి అనుకూలమా? కాదా? అని అభిప్రాయ సేకరణ చేస్తారు.
ఇవన్నీ కూడా అందిరికీ తెలిసిన సత్యాలే. ఖైదీ నెంబర్ 150 సినిమా ఒరిజినల్ అయిన తమిళ్ మూవీ ‘కత్తి’ సినిమాలో చూపించిన విషయాలే. కానీ చిరంజీవికి మాత్రం అవసరం తీరేవరకూ ఓటు మల్లన్న, తీరాక బోడి మల్లన్న అనే టైపులో వ్యవహరిస్తున్న అధికార పార్టీల తప్పు కనిపించలేదు. కేవలం కార్పొరేట్ కంపెనీల తప్పు మాత్రమే కనిపించింది. పైగా ప్రచార కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వాలను, పార్టీలను విమర్శిస్తూ తమిళ్లో ఉన్న డైలాగులు మార్చామని చిరంజీవే స్వయంగా చెప్పాడు. ఆ రాజకీయ విమర్శలుండబట్టే తమిళ్ కత్తిలో యాక్ట్ చేసిన విజయ్ సమస్యలు ఫేస్ చేశాడు అని నాకు ఆ సమస్య లేదన్నట్టుగా చెప్పాడు. చిరంజీవికి తెలుసో…తెలియదో కానీ విజయ్‌ని అక్కడి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు. కానీ ఆ సంఘటన తర్వాత జనం మాత్రం విజయ్‌ని రియల్ హీరో అన్నారు. విజయ్, మురుగదాస్‌కి ఈ కార్పొరేట్ తెలివితేటలు లేక కాదు….వాళ్ళ నిజాయితీ, చిత్తశుద్ధి అది. రైతుల కష్టాలను కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించాలని అనుకున్నారు. అదే తెలుగుకు వస్తే మాత్రం రాజ్యసభ్యుడు, రాజకీయ నాయకుడు కూడా అయిన చిరంజీవి మాత్రం రైతుల సమస్యలతో ఓ సినిమా తీసి హిట్ కొట్టాలని అనుకున్నాడు. మళ్ళీ 2019 ఎన్నికల్లో ఇదే చిరంజీవి…….పేద, బడుగు, బలహీన వర్గాలు, సామాన్యులు, రైతుల కోసమే నా జీవితం అంకితం అని చెప్పడన్న గ్యారెంటీ ఏమీ లేదు. దట్ ఈజ్ ‘రాజకీయం’.