విశాఖపట్నం ఐటీ ముఖచిత్రాన్ని మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా అంతర్జాతీయ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని, ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఆర్ఎంజెడ్ విశాఖలో భారీ పెట్టుబడులతో అడుగుపెట్టేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. క్యాప్‌జెమిని సంస్థ విశాఖలో తన కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా వేలాది మంది టెక్కీలకు ఉపాధి లభించడమే కాకుండా, నగరానికి గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ లభిస్తుందని ఐటీ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు, ఆర్ఎంజెడ్ సంస్థ అత్యాధునికమైన ఐటీ పార్క్ , గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం వీరికి కావాల్సిన భూమి ,రాయితీలపై సానుకూలంగా స్పందించడంతో, త్వరలోనే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
గత కొద్ది నెలలుగా విశాఖ ఐటీ రంగంలో కీలకమైన డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇటీవల ఇన్ఫోసిస్ తన డెవలప్మెంట్ సెంటర్‌ను విశాఖలో పూర్తిస్థాయిలో విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఐటీ అడ్వాంటేజ్ విశాఖ వంటి సదస్సుల ద్వారా ప్రభుత్వం చేస్తున్న ప్రమోషన్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
ఈ కొత్త కంపెనీల రాకతో విశాఖ సెకండ్ టైర్ నగరం నుండి మెట్రో నగరాల పోటీలోకి చేరుతోంది. ప్రభుత్వం రుషికొండ, కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, స్టార్టప్ విలేజ్‌ను బలోపేతం చేయడం ఐటీ కంపెనీలను ఆకర్షిస్తోంది. విశాఖకు ఉన్న సహజసిద్ధమైన వాతావరణం, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ , నైపుణ్యం కలిగిన మానవ వనరులు క్యాప్‌జెమిని వంటి కంపెనీలు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. రాబోయే రెండేళ్లలో విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే మరో ప్రధాన ఐటీ హబ్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.