తమిళనాడులో టీవీకే పార్టీతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న హీరో విజయ్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు కాస్త విచిత్రంగా ఉంది. మధురైలో ఆయన పార్టీ బహిరంగసభను నిర్వహించారు. దీనికి భారీ ఏర్పాట్లు చేశారు. ర్యాంప్ ఏర్పాటు చేసి దానిపై నడుస్తూ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఆ సమయంలో ఓ ఫ్యాన్ ర్యాంప్ పైకి దూసుకు వచ్చాడు. అతన్ని విజయ్ సెక్యూరిటీ పట్టుకుని కిందకు నెట్టేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే ఆ ఫ్యాన్ ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై విజయ్ భద్రతా సిబ్బంది దాడి చేశారని ఫిర్యాదు చేశారు. విజయ్ అక్కడే ఉన్నా ఆపలేదన్నారు. దాంతో పోలీసులు విజయ్ తో ఆయనకు భద్రతగా ఉన్న బౌన్సర్లపై కేసు పెట్టేశారు. అది బహిరంగసభ .. విజయ్ వద్దకు దూసుకెళ్లడం ఆపకపోతే అతను ఖచ్చితంగా విజయ్ పై పడిపోయి ఉండేవాడు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికే భద్రతా సిబ్బంది ఉన్నారు. అయినా ఇక్కడ తప్పు ఆ అభిమానిదే అవుతుంది కానీ..విజయ్ ది కాదు. అయినా పోలీసులు కేసు పెట్టారు.
ఇలాంటి సిల్లీ కేసులు నాయకుడికి క్రేజ్ ను.. సానుభూతిని పెంచాయి. ఎందుకంటే అతను విజయ్ అభిమానే. మరి కేసు ఎందుకు పెట్టారో చెప్పాల్సిన పని లేదు. ఇతర పార్టీల వాళ్లు అతన్ని ప్రభావితం చేసి ఫిర్యాదులు చేయించి ఉంటారు. అలా చేశారు కాబట్టే పోలీసులు కూడా పెద్దగా ఆలోచించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉంటారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లోపు.. తమిళనాడులో ఇలాంటి రాజకీయాలు ఎన్ని జరుగుతాయో ?