ఆ వ్యాఖ్య‌లు జ‌గ‌న్ మెడ‌కు చుట్టుకున్న‌ట్టే!

ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌లు ఈ మ‌ధ్య వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. గుంటూరు ప్లీన‌రీలో ‘చంద్ర‌బాబు నాయుడును న‌డిరోడ్డుపై పెట్టి కాల్చినా త‌ప్పులేద‌ని అనిపిస్తోంద‌ని’ జ‌గ‌న్ అభ్యంత‌ర‌క‌ర విమ‌ర్శ‌లు చేశారు. దీంతో టీడీపీ తీవ్రంగానే ప్ర‌తిస్పందించింది. అయినా అక్క‌డితో ఆగ‌కుండా… నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా ఇదే ధోర‌ణి కొన‌సాగించారు. ముఖ్య‌మంత్రికి బ‌ట్ట‌లూడ‌దియ్యాలి, న‌డిరోడ్డు మీద ఉరి తియ్యాలి అంటూ విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ విమ‌ర్శ‌లు అభ్యంత‌ర‌కంగా ఉన్నాయ‌నీ, ముఖ్య‌మంత్రి స్థాయి నాయ‌కుడిపై ఇలా విమ‌ర్శ‌లు చేయ‌డం దారుణ‌మనీ, ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ రిట‌ర్నింగ్ అధికారికి టీడీపీ ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఫిర్యాదుపై ఈసీ వెంట‌నే స్పందించింది. వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్ ను వివ‌ర‌ణ కోరింది. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌కుండా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మోసం చేస్తున్నార‌న్న ఆవేద‌న‌తో అలా స్పందించాన‌నీ, అలా మాట్లాడ‌టం వెన‌క వేరే ఉద్దేశాలు లేవ‌ని జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇచ్చారు! దీంతో ఈసీ కూడా ఊరుకుంది. కానీ, టీడీపీ ఇక్క‌డితో ఈ విష‌యాన్ని వ‌దిలెయ్య‌లేదు.

ఆ త‌రువాత, నంద్యాల ఉప ఎన్నిక‌ ప్ర‌చారంలో జ‌గ‌న్ య‌థేచ్ఛ‌గా అదే స్థాయి తీవ్ర ప‌ద‌జాలం వాడుతూ వ‌చ్చారు. దీంతో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదంటూ టీడీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్ర‌యించామ‌ని తెలిపారు. ఈ ఫిర్యాదుపై సీఈసీ స్పందించింది. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే విధంగానే ఉన్నాయ‌నీ, ఇది ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కింద‌కి వ‌స్తుంద‌నీ, జ‌గ‌న్ పై ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం కింద కేసు న‌మోదు చేయాల‌ని కూడా సీఈసీ ఆదేశించింది. ఎన్నిక‌ల ఆదేశం మేర‌కు జ‌గ‌న్ పై కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. దీన్ని నైతిక విజ‌యంగా తెలుగుదేశం ప్ర‌చారం చేసుకుంటోంది. ముఖ్య‌మంత్రిని ఈ స్థాయిలో విమ‌ర్శించిన నేతను గ‌తంలో చూడ‌లేద‌నీ, ఇలాంటి వారిపై చ‌ర్య‌లకు ఆదేశించ‌డం ద్వారా ప్ర‌జాస్వామ్యంపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పెరుగుతుంద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఇక‌, వైకాపా కూడా ఏమాత్రం త‌గ్గడం లేదు! జ‌గ‌న్ పై ఎలాంటి కేసులు పెట్టాలో, ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో కూడా ఎన్నిక‌ల సంఘానికి తెలుగుదేశం సూచిస్తున్న‌ట్టుగా ఉంద‌ని వైకాపా నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

ఏదేమైనా, బ‌హిరంగ స‌భ‌ల్లో హ‌ద్దు మీరి మాట్లాడితే చ‌ర్య‌లు ఉండాల్సిందే. కాల్చేస్తాం, ఉరితీస్తా, గుడ్డ‌లూడ‌దీస్తా… ఇలాంటి ప‌ద‌జాలం ఉప‌యోగించ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు ఏం సందేశం ఇస్తున్న‌ట్టు..! ఇలాంటి వ్యాఖ్య‌ల్ని ఉపేక్షిస్తే… ఇదే కొత్త పంథాగా మారిపోతుంది. దీన్నే అనుస‌రించేవారు, అనుక‌రించేవారు రావొచ్చు. అంబ‌టి రాంబాబు లాంటి వాళ్లు ఎంత‌గా బుకాయిస్తున్నా… జ‌గ‌న్ వ్యాఖ్య‌లు శృతి మించాయ‌న‌డంలో సందేహం లేదు. ఇలాంట‌ప్పుడు స‌మ‌ర్థించుకునేలా మాట్లాడితే ప్ర‌జ‌లు హ‌ర్షిస్తారా చెప్పండీ!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com