మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. భీమిలి సముద్రతీరంలోని అక్రమ నిర్మాణాలపై ఈ కేసులు నమోదు చేశారు. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ అథారిటీ పర్యావరణ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిజానికి కేసులు పెట్టడం చాలా ఆలస్యం అయింది. హైకోర్టు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసిన తర్వాతనే కేసు నమోదు చేశారు. ఆ విషయం కూడా రహస్యంగా ఉంచారు. పదో తేదీన కేసు నమోదు చేస్తే తాజాగా వెలుగులోకి వచ్చింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర సీఎంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు. ఆయన కుమార్తె పేరుతో భీమిలీ బీచ్ ను కాజేయాలని చూశారు. పెద్ద ఎత్తున రిసార్టులు, హోటళ్లు కట్టేందుకు బీచ్ ను కబ్జా చేసి.. చాలా లోతుకు తవ్వి పునాదులు కూడా వేశారు. కనీసం కిలోమీటర్ మీర గోడ కట్టినట్లుగా గుర్తించారు. జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ .. ఈ అంశాలపై సమగ్రంగా హైకోర్టును ఆశ్రయించారు. పర్యావరణ విధ్వంసం చేస్తున్న వ్యవహారం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా కట్టిన గోడల్ని నేహారెడ్డి, రోహిత్ రెడ్డి ఖర్చులతో తొలగించడమే కాకుండా వారిపై కేసులు పెట్టాలని ఆదేశించింది. నిర్మాణాలను కూడా చాలా ఆలస్యంగా తొలగించారు. ఒకటికి రెండు సార్లు న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తేనే కేసు పెట్టారు. తదుపరి చర్యలు ఏం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది.