ప్రపంచం మొత్తం తిరుగుతూ అక్కడి విశేషాలను చూపించే యూట్యూబర్ అన్వేష్ ఇటీవల దారి తప్పారు. బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ పై పోరాటం అంటూ ఆయన ఇష్టం వచ్చినట్లుగా అందరిపై ఆరోపణలు చేస్తూ.. బూతులు తిడుతూ రచ్చ చేస్తున్నారు. అసలు ట్రావెల్ స్టోరీల కన్నా ఇవే ఎక్కవైపోయాయి. మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్ ల యాడ్స్ ఉన్నాయని అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ వీడియో చేశారు.
హైదరాబాద్ మెట్రోలో 300 కోట్ల బెట్టింగ్ స్కాం జరిగిందని ఆరోపించారు. ఇందులో చాలా మంది పేర్లను అసువుగా వాడేశారు. డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డితో పాటు మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ల మీద ఆరోపణలు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రకటనలతో రూ.300 కోట్లు కొట్టేశారని అన్నారు. ఈ వీడియో వైరల్ అయ్యాయి. దీంతో ఓ కానిస్టేబుల్ అధికారులపై తప్పుడు ప్రచారం చేశాడని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
వ్యూస్ కోసమో.. లేకపోతే పేరు కోసమో కానీ.. తన చానల్ ను అన్వేష్ వివాదాస్పద అంశాలకు వినియోగించుకుంటున్నారు. కొంత మంది యూట్యూబర్లు, వారి ఫ్యామిలీలపై అనుచిత వ్కాఖ్యలు చేశారు. బూతు మాటలతో రెచ్చిపోతూంటారు. ఇప్పుడు ఆయనపై కేసునమోదు అయింది. ఆరోపణలకు క్షమాపణలు చెబితే చూసిచూడనట్లుగా ఉంటారేమో కానీ. ఈ వివాదాన్ని పెంచుకుంటే.. ఎప్పుడైనా హైదరాబాద్ ల్యాండవ్వగానే అరెస్టు చేసే అవకాశం ఉంది.