పరకామణి దొంగలతో చేతులు కలిపిన ముగ్గురు పోలీసుల వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. హైకోర్టు విచారణలో ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు చెప్పింది. నిందితులతో ముగ్గురు పోలీసులు కుమ్మక్కయ్యారని ఆధారాలు బయటపడ్డాయని వివరించింది. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే ఇలా చేయడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్న హైకోర్టు ముగ్గురిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వారిపై ఏసీబీ విచారణ చేపట్టాలని కూడా సూచించింది.
ముగ్గురు పోలీసులను ఇప్పటికే వీఆర్ కు పంపించారు. వారిపై కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. మరో వైపు రవికుమార్ ఆస్తులు ఎవరెవరి పేర్లపైకి బదలాయింపు అయ్యాయి అన్నదానితో పాటు ఆయన అంత పెద్ద మొత్తం ఎలా సంపాదించారు.. పరకామణిలో ఎంత కాలం నుంచి చోరీ చేస్తున్నారు వంటి విషయాలను కూడా సీఐడీ వెలికి తీస్తోంది. వాటికి సంబంధించిన నివేదికలను ఇప్పటికే కోర్టుకు సమర్పించారు. తదుపరి విచారణను కోర్టు ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది.
రవికుమార్ పెద్ద జీయర్ మఠంలో ఉద్యోగి. ఆయనకు పరకామణిలో విదేశీ కరెన్సీనిలెక్కించే బాధ్యతలు ఇచ్చారు. ఆయన అలా లెక్కిస్తూ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. ఎంత కాలం నుంచి ఈ దోపిడీ చేస్తున్నారో కానీ ఆయన ఓ సారి పట్టుబడ్డారు . కేసు నమోదు అయింది. అయితే అనూహ్యంగా ఆయన వద్ద ఆస్తులు టీటీడీకి రాయించి కేసు రాజీ చేశారు. వైసీపీ హయాంలో ఇదంతా సింపుల్ గా నడిచిపోయింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక బయటపడింది. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో అసలు విషయాలన్నీ బయటకు రావడం ప్రారంభమయ్యాయి.
