శ్రీవారి లడ్డూ ప్రసాదం, కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలను పక్కన పెట్టి, అబద్ధాన్ని నిజం చేసేందుకు వైసీపీ భారీ ఎత్తున నిధులను కుమ్మరిస్తోంది. ఇప్పటికే తమ వద్ద ఉన్న సోషల్ మీడియా సైన్యం సరిపోదన్నట్లుగా, సామాన్య వీడియో క్రియేటర్లను, ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఈ ప్రచారంలోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్క అబద్ధాన్ని వెయ్యి సార్లు చెబితే అది నిజం అవుతుందనే పాత సిద్ధాంతాన్ని నమ్ముకుని, వందల కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు.
ఐదు వేల ఆశ.. జీవితాంతం శిక్ష?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు చేసే ప్రతి చిన్న క్రియేటర్‌కు వైసీపీ నుంచి ఆఫర్లు వెళ్తున్నట్లు సమాచారం. ఒక్క వీడియో చేస్తే ఐదు వేల రూపాయలు ఇస్తాం అంటూ ఆశచూపుతూ, హెరిటేజ్ సంస్థపై , కల్తీ నెయ్యి అంశంపై తప్పుడు ప్రచారం చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా అవగాహన లేక ఈ పెయిడ్ వీడియోలకు ఒప్పుకుంటున్నారు. అయితే, ఆ తాత్కాలిక ఐదు వేల రూపాయల కోసం చేసే తప్పుడు ప్రచారం, భవిష్యత్తులో వారి జీవితాలనే ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెరిటేజ్ లక్ష్యంగా కుట్రపూరిత ప్రచారం
శ్రీవారి లడ్డూ అపవిత్రత విషయంలో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు, హెరిటేజ్ సంస్థను వివాదంలోకి లాగడమే లక్ష్యంగా ఈ వ్యూహం సాగుతోంది. ఎక్కడా ఆధారాలు లేకపోయినా, కేవలం సోషల్ మీడియా వేదికగా బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వీడియోలు నెట్టింట కనిపిస్తున్నప్పటికీ, వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశం స్పష్టంగానే అర్థమవుతోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని, ఒక వ్యాపార సంస్థను అప్రతిష్ట పాలు చేయడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందనే విమర్శలు వస్తున్నాయి.
న్యాయపరమైన చిక్కులు – ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే!
డబ్బుకు కక్కుర్తి పడి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారికి చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, మతపరమైన అంశాలపై లేదా సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తే కఠినమైన ఐటీ చట్టాల కింద కేసులు నమోదవుతాయి. ఒకసారి కేసు నమోదైతే కోర్టుల చుట్టూ తిరగడం, కెరీర్ నాశనం అవ్వడం వంటి నరకప్రాయమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ పరిణామాలను గమనిస్తున్న తెలివైన యువత, వైసీపీ ఇచ్చే ఐదు వేల ఆఫర్ల జోలికి వెళ్లడం లేదు.
రాజకీయ పార్టీలు ఇచ్చే నిధుల కోసం సామాన్యులు బలికావద్దు. ఒక్క వీడియో మీ జీవితాంతం మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అబద్ధాన్ని వందల కోట్లు పెట్టి కొన్నా, అది నిజం కాలేదని చరిత్ర నిరూపించింది.
