తెలుగు రాజకీయాల్లో కులం లోతులు

భారత రాజకీయాలనుంచి కులాన్ని వేరుచేయడం సాధ్యంకాదు. సమాజంలో వివక్షకు సాంఘిక, ఆర్ధిక అంశాల్లో ఏ ఒక్కటో కాకుండా రెండూ అల్లుకుపోయిన ప్రత్యేకతే ఇందుకు మూలం. ఈ మూలాన్ని పూర్వపు ఆంధ్రప్రదేశ్ కు అన్వయించి చూస్తే కులం ప్రమేయాలు ప్రభావాలు అనివార్యతలు అర్ధమౌతాయి.

జాతీయోద్యమ కాలం నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ కు వుండిన కాంగ్రెస్ నాయకత్వం స్వాతంత్ర్యం వచ్చాక కూడా కొసాగింది. తరువాత రెడ్డి కులస్థుల నాయకత్వం మొదలైంది. వయోజనులందరికీ ఓటు హక్కు – ఆధిపత్య వర్గాలకు మరికొన్ని సామాజిక వర్గాలను వెంటతీసుకోవలసిన అవసరాన్ని కల్పించింది. అప్పటి కాంగ్రెస్ విధానాలు (దేశవ్యాప్తంగా) ఆగ్రవర్ణాలు, దళితుల కాంబినేషన్ లో ఒక గెలుపు ఫార్ములా తయారైంది.

ఈ సమీకరణ / గెలుపు వ్యూహంతో ఆత్యధిక సంఖ్యలో వున్న బిసి కులాలను కాంగ్రెస్ పట్టించుకోనే లేదు. అగ్రవర్ణాలలో స్ధానిక వైరుధ్యాలలో ఆధిపత్యాన్ని నిలుపుకోడానికే అక్కడక్కడా బిసిలకు ప్రాతినిధ్యం దొరికేది. అంతేతప్ప బిసిలకు ఒక సూత్రబద్దమైన ఆదరణను కాంగ్రెస్ ఇవ్వలేదు.

పివి నరశింహారావు ముఖ్యమంత్రిగా వున్నపుడు భూసంస్కరణలు అమలు చేయడానికి ప్రయత్నించారు. బిసిలకు ఆర్ధిక ప్రయోజనాలు కలిగే విధానాలు రూపొందించారు. బిసిలకు రాజకీయంగా చేయూత ఇచ్చారు. రాజకీయాల్లో కుల సమీకరణలు మారిపోగల బిసిల ప్రాధాన్యత రెడ్లకు వెలమదొరలకు నచ్చలేదు. ఆ నేపధ్యంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. అపుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు కానీ పివి ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది. కులసమీకరణల్లో మార్పులను అంగీకరించని అగ్రవర్ణాల అహం ఆవిధంగా శాంతించింది.

అయితే గ్రాస్ రూట్స్ లో బిసిల సాంఘిక, ఆర్ధిక ఎదుగుదలలను కాంగ్రెస్ గుర్తించలేదు.

పుట్టిన వెంటనే తెలుగుదేశం కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించడంలో, ఘనవిజయం సాధించడంలో ప్రధానమైన ఫ్యాక్టర్ ఇదే!

కృష్ణా డెల్టా ప్రాంతంలో వ్యవసాయంలో సిరిసంపదలు పండించి, సినీ, హొటల్, ఫైనాన్స్, పరిశ్రమలు, విద్య, వైద్యరంగాల్లో వ్యాపించిన కమ్మ కులం సామాజిక ప్రాబల్యం ఎన్ టి ఆర్ ఐకాన్ గా రాజకీయ రంగానికి విస్తరించింది. అప్పటి వరకూ అధికారపక్షం పట్టించుకోని బిసిలు తెలుగుదేశం పార్టీని నెత్తిన పెట్టుకుని మోశారు.

కాంగ్రెస్ కు దగ్గరగా వున్న కాపులలో హెచ్చిమంది ఎన్ టి ఆర్ కే మద్దతు ఇచ్చారు. రంగా హత్యతరువాత కాపులు కాంగ్రెస్ వైపునకు మారిపోయారు. బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు, అత్యున్నత అధికారంలోకి వచ్చారు. తరువాత తామే రాజకీయ నిచ్చెనలు ఎక్కాలనుకున్న కాపులకు ఈ 20 ఏళ్ళుగా సమీకరణలు కుదరడం లేదు. ఫలితంగా వైఫల్యాలు తప్పటంలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వారిని ఒక నైరాశ్యం లోకి నెట్టేసింది.

కాంగ్రెస్ తోనే వున్న రెడ్లలో రాజశేఖరరెడ్డి హయంలో ఎన్నడూ లేనంత ఐక్యత వచ్చింది.

రాష్ట్ర విభజనతో కులాల బలాలు మారాయి. తెలంగాణ లో వెలమల ఆధిపత్యం రెడ్లను కొంత వెనకక నెట్టింది. అక్కడ కాంగ్రెస్ వైఫల్యాలకు సామాజిక మూలం ఇదే!

పూర్వపు ఆంధ్రప్రదేశ్ లో రెడ్లది ఆధిపత్యంకాగా విభజన అనంతరం ఎపిలో ఆధిపత్యం కమ్మవారిదయింది. పూర్వపు ఆంధ్రప్రదేశ్ లో కాపుల 18 శాతం కాగా ఇప్పటి ఎపిలో అది 22 శాతం వరకూ వుందంటున్నారు.

చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇస్తాననడానికి మూలం ఈ సంఖ్యాబలమే! రాజకీయాల్లో గెలుపు సమీకరణలు తీసుకురావడానికి బాబు చేసిన ఈ ప్రయత్నం బిసిలను తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తున్నట్టు కనిపస్తున్నది.

చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ ల పరస్పర విమర్శలు, ప్రతి విమర్శల ప్రభావం జనంలో గట్టిగా వుండటానికి ఒక ముఖ్యమైన కారణం ఆ ముగ్గురు నాయకుల కులాలు… వారిని అభిమానించే సామాజికవర్గాలే!

విద్యావకాశాలు, విదేశీ ఉద్యోగాలు, పెరిగిన ఆదాయాలు, మారుతున్న భావజాలాలు అన్ని కులాల్లోనూ వున్నాయి. వీటన్నిటి సామాజిక ట్రాన్స్ ఫర్మేషన్ ప్రభావంకూడా కుల సమీకరణల్లో తటస్ధతను, ఆబ్జెక్టివిటీని పెంచుతుంది.

– పెద్దాడ నవీన్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com