కాంగ్రెస్ పార్టీ కొంత కాలంగా బీజేపీ చేస్తున్న మత రాజకీయాలకు కౌంటర్ గా కుల రాజకీయాలు చేస్తోంది. కులగణన చేసి జనాభా ప్రకారం అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఆ రిజర్వేషన్లు మారుస్తారో లేదో కానీ కలగణనకు మాత్రం కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేపడతారు. సహజంగానే మతం లెక్కలు బయటకు వస్తాయి. కానీ దీని వల్ల లాభం ఏమిటి ?
ప్రపంచవ్యాప్తంగా ప్రతిభకే పెద్దపీట
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతిభ మాత్రమే ఉపయోగపడుతుంది. ఇండియాలో మాత్రం టాలెంట్ ఉన్నా కులమే హైలెట్ అవుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కుల వివక్ష ఉందని.. అసలు కుల వ్యవస్థ వెనుకబాటుకు కారణం అని దాన్ని రూపుమాపాలని ఉద్యమాలు జరిగేవి. చదువుకోని వారు కూడా అభ్యుదయంతో ఉండేవారు. రాను రాను దేశంలో అక్షరాస్యత పెరిగింది. కానీ కుల మూర్ఖత్వం పెరిగిపోయింది. ఓ కులానికి చెందిన రెచ్చగొట్టే, రాజకీయాలు చేసే రకం మనుషులు మరో కులాన్ని చూపించి వారి వల్ల తాము దెబ్బతిన్నామని ఆరోపించుకోవడం ప్రారంభించారు. ఫలితంగా విద్వేషాలు పెరిగిపోయాయి.
భారతదేశంలో కుల, మతాల రాజకీయాలు
ఇప్పుడు దేశవ్యాప్తంగా కుల చిచ్చు అంటుకుంది. కాంగ్రెస్ పార్టీ దానికి ఆజ్యం పోస్తూ వస్తోంది. కుల వ్యవస్థే వద్దని.. దాన్ని అధికారికంగా మూసేద్దామని.. కేవలం పేద, ధనిక అనే వర్గాలను మాత్రమే ఉంచి.. పేదలను పైకి తీసుకు వచ్చే ఏర్పాట్లు చేయాల్సిన రాజకీయం పూర్తిగా దారి మార్చింది. కులాల్లో పేదరికాన్ని అలాగే ఉంచి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ.. వారిని మరింత పతనంలోనే ఉంచుతున్నాయి. ఇప్పుడు దానికి కులగణన మరింత ఆజ్యం పోయనుంది.
రాజకీయ పార్టీల ప్రమాదకర ఆట
కులగణన తర్వాత ఆయా వర్గాల్లో తమకు జనాభాలో ప్రాతినిధ్యం ప్రకారం అవకాశాలు దక్కాలని డిమాండ్ చేస్తాయి. రాజకీయ పార్టీలు హామీలు ఇస్తాయి. రిజర్వేషన్లు పెంచుతాయి. అందరికీ రిజర్వేషన్లు ఇచ్చి ఓపెన్ కేటగిరిలో ఓసీలు ఉంటారు. వారు మాత్రం ఎందుకు ఊరుకుంటారు ?. ఎంతో కొంత తమ జనాభా ఎంత తేలితే అంత రిజర్వేషన్లు ఇవ్వాలని పట్టుబడుతారు. దానికి అంతం ఉండదు. కుల, మతాలతో రాజకీయం ఎప్పటికైనా దేశ ప్రజల మధ్య విభజన గీత కనిపిస్తుంది. అది మంచిది కాదు. కానీ రాజకీయ పార్టీలు దాన్నే నమ్ముకుంటున్నాయి.