కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ విచారణ ప్రారంభించింది. ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అయితే ఇందులో విజయ్ పేరు లేకపోవడంతో తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. నిజానికి తమిళనాడు పోలీసులు నమోదు చేసిన కేసులోనూ విజయ్ పేరు లేదు.కానీ అసెంబ్లీలో సీఎం స్టాలిన్ తొక్కిసలాట ఘటనకు విజయే కారణం అని చెప్పారు. ఆలస్యంగా రావడం.. భారీ జన సమీకరణ చేయడం కారణమనన్నారు.
ఈ క్రమంలో తనను నిందితుడిగా మార్చే కుట్ర ఉందని అనుమానించిన విజయ్ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ..సీబీఐ విచారణకు ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు సీబీఐ.. విజయ్ పేరు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆయన బీజేపీ రక్షణలోకి వెళ్లిపోయారని ఇతర పార్టీల నేతలు ఆరోపించడం ప్రారంభించారు. సినీ పరిశ్రమ నుంచే వెళ్లి పార్టీ పెట్టుకున్న దర్శకుడు సీమాన్ విజయకు వ్యతిరేకంగా భారీ ప్రకటనలు చేస్తున్నారు.
తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ నేతృత్వంలో సెప్టెంబర్ 27న జరిగిన ర్యాలీలో 41 మంది మరణాలకు విజయ్ బాధ్యుడని, అయినా FIRలో అతని పేరు లేకపోవడం విచారకరమని ప్రకటించారు. అందరికీ 20 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చి భవిష్యత్ లో అండగా ఉంటామని చెప్పడం వారిని మాట్లాడకుండాచేయడానికేనని ఆయన ఆరోపించారు. విజయ్ BJPతో దగ్గరి సంబంధాలు పెట్టుకున్నారని.. CBI దర్యాప్తు విజయను కాపాడటానికేనని అంటున్నారు.
సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేయకపోతే.. టీవీకే నేతలను బయటపడేలా చేస్తే.. ఇదే నిజమని ప్రజలు అనుకుంటారు. అది విజయకు రాజకీయంగా నష్టం చేస్తుంది.
