తమిళనాడులోని కరూర్ జిల్లాలో గతేడాది జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు, నటుడు విజయ్‌కు సీబీఐ తాజాగా సమన్లు జారీ చేసింది. మంగళవారమే ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఆయనను ఆదేశించారు. ఇప్పటికే జనవరిలో రెండు విడతలుగా విజయ్ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
గత ఏడాది సెప్టెంబర్ 27న విజయ్ తన రాజకీయ పార్టీ తొలి భారీ బహిరంగ సభను కరూర్‌లో నిర్వహించారు. ఈ సభకు సామర్థ్యానికి మించి భారీ సంఖ్యలో జనం రావడంతో ముగింపు సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలతో సహా మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక విచారణలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం , నం రాకను అంచనా వేయడంలో విఫలం కావడం వల్లే ఈ ఘోరం జరిగిందని తేలింది.
మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేయగా, బాధితులకు న్యాయం జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో దర్యాప్తు సీబీఐకి బదిలీ అయ్యింది. ప్రస్తుత విచారణలో సీబీఐ సేకరించిన కొత్త సాక్ష్యాధారాల ఆధారంగా విజయ్ నుంచి కొన్ని స్పష్టతలు కోరాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బిజీగా ఉన్నందున విజయ్ తరపు న్యాయ బృందం విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
