ఇంటి స్థలం లేదా ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయడానికి ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఓ పది , ఇరవై ఏళ్ల తర్వాత స్థలం విలువ చాలా పెరుగుతుందన్న ఉద్దేశంతో ఊరికి దూరమైనా సరే కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచన ఉన్నవారు తీసుకోవాల్సిన ఐదు కీలక జాగ్రత్తలు ఇవి.
టైటిల్ డీడ్ , లింక్ డాక్యుమెంట్లు
స్థలం అమ్మే వ్యక్తికి ఆ ఆస్తిపై పూర్తి హక్కులు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. కనీసం గత 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లనుపరిశీలించడం ముఖ్యం. దీనివల్ల ఆ స్థలం గతంలో ఎవరెవరి చేతులు మారింది, ఎక్కడైనా వివాదాలు ఉన్నాయా అనేది స్పష్టమవుతుంది.
ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్
సదరు స్థలంపై ఏవైనా అప్పులు, తాకట్టులు లేదా కోర్టు కేసులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి EC తీసుకోవాలి. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే గత కొన్నేళ్లుగా ఆ ఆస్తిపై జరిగిన లావాదేవీల వివరాలన్నీ ఇందులో కనిపిస్తాయి. నిల్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఉంటే ఆ స్థలంపై ఎలాంటి భారాలు లేవని అర్థం.
లేఅవుట్ అనుమతులు
ప్లాట్ కొనేముందు అది ప్రభుత్వం గుర్తించిన సంస్థలు DTCP, HMDA సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థలు నుంచి అనుమతి పొందిందో లేదో చూడాలి. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొంటే భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి అనుమతులు రావు, అలాగే బ్యాంక్ లోన్లు కూడా దొరకవు.
భూ వినియోగ ధృవీకరణ
మీరు కొనే స్థలం ఏ జోన్లో ఉందో తెలుసుకోవాలి. అది నివాస ప్రాంతమా , వ్యవసాయ భూమా లేదా పారిశ్రామిక ప్రాంతమా అనేది ముఖ్యం. వ్యవసాయ భూమి అయితే దానిని NALA చట్టం ప్రకారం నివాస స్థలంగా మార్పిడి చేశారో లేదో సరిచూసుకోవాలి.
క్షేత్రస్థాయి పరిశీలన , కొలతలు
కాగితాలు అన్నీ బాగున్నా, స్వయంగా వెళ్లి స్థలాన్ని చూడాలి. సరిహద్దులు స్పష్టంగా ఉన్నాయా, చుట్టుపక్కల ఆక్రమణలు ఏమైనా ఉన్నాయా అనేది గమనించాలి. ప్రభుత్వ సర్వేయర్‌తో ప్లాట్ కొలతలు వేయించి, డాక్యుమెంట్లలో ఉన్న విస్తీర్ణం క్షేత్రస్థాయిలో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసే ముందు ఒక సీనియర్ లాయర్‌తో డాక్యుమెంట్లను వెరిఫై చేయించుకోవడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం.
