ఆంధ్రప్రదేశ్ కోసం టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ “స్వర్ణాంధ్రప్రదేశ్ 2047” పై ఓ నివేదిక అందించింది. ఈ నివేదిక రాష్ట్ర ఆర్థిక , పారిశ్రామిక అభివృద్ధి కోసం 120 సిఫార్సులను అందించింది. ఈ సిఫార్సులు రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, విజన్ 2047 సాధనకు మార్గనిర్దేశం చేయడం ,అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన సూచనలు అందించాయి. ఈ నివేదికను టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
ఏపీ కోసం సమయం కేటాయించిన టాటా చైర్మన్
టాటా గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి , మౌలిక సదుపాయాల బలోపేతం కోసం టాటా గ్రూపు తనకు వీలైనంత సాయం చేయనుంది. అలాగే పెట్టుబడులు కూడా పెడుతుంది. టాటా గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్ క్షణం తీరిక ఉండని కార్పొరేటర్ లీడర్. గ్రూపు కంపెనీల వ్యవహారాలను చూసుకోవడానికి ఆయన ఎంతో ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ చంద్రబాబు అడిగారని.. తన కార్పొరేట్ అనుభవం, ఏపీ కి ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అన్నీ చూసి.. ప్రతిపాదనలు చేశారు.
విజేతల ఆలోచనల్ని అమలు చేసేందుకు చంద్రబాబు సిద్ధం
చంద్రబాబు అన్నీ తనకు తెలుసు అన్నట్లుగా చెబుతూంటారు కానీ.. ప్రతి ఒక్కరి ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎదుటి వారు చెప్పేది పూర్తిగా వింటారు. అదే సమయంలో విజేతల సక్సెస్ సీక్రెట్స్, వారి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. టాటా గ్రూపు అభివృద్ధి ఎంతో స్థిరమైనది. ఎలాంటి ఒడిదుడుకులు ఆ సంస్థను ఇబ్బంది పెట్టలేవు. అందుకే ఆ కార్పొరేట్ సంస్థ నైపుణ్యాన్ని.. ఆ సంస్థ నాయకత్వ ఆలోచనలను రాష్ట్రానికి అన్వయింపు చేస్తే.. అద్భుతమైన విజయాలు సాధించవచ్చని అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. చంద్రశేఖరన్ చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ను నియమించి ఏపీ కోసం ప్రతిపాదనలు కోరారు.
ఏపీకి ఉపయోగపడుతున్న చంద్రబాబు గుడ్ విల్
మామూలుగా అయితే చాలా మంది కార్పొరేట్ లీడర్లు ఇలాంటి ప్రతిపాదనలను అంగీకరించరు. ఒత్తిడితో అంగీకరించినా లైట్ తీసుకుంటారు. ఏదో తూ..తూ మంత్రం నివేదిక ఇస్తారు. కానీ ప్రస్తుత టాటా చైర్మన్ చంద్రశేఖరన్ ఒకప్పుడు చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా పని చేశారు. హైదరాబాద్ లో టీసీఎస్ కార్యకలాపాలు ఈ ఈ రోజు ఇంత విస్తృత స్థాయిలో జరగడానికి కారణం చంద్రబాబేనని చంద్రశేఖరన్ చెబుతారు. టాటా గ్రూపు చైర్మన్ అయ్యే వరకూ టీసీఎస్ బాధ్యతలను చూసుకుంది చంద్రశేఖరనే. పారిశ్రమికవేత్తల్లో చంద్రబాబుకు ఇలాంటి గుడ్ విల్ ఉంది. వారంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తున్నారు.