విశాఖపట్నం రూపురేఖలు మార్చే మెట్రో ప్రాజెక్టు కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సుమారు 76.9 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్వర్క్ డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం తెలపడంతో విశాఖ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నగరం నలుమూలలా 20కి పైగా స్టేషన్లను నిర్మించనున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులో*ఆసియాలోనే అత్యంత పొడవైన బై-లెవల్ వయాడక్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అంటే ఒకే పిల్లర్‌పై రెండు స్థాయిల్లో రవాణా సౌకర్యం ఒకటి మెట్రో కోసం, మరొకటి వాహనాల కోసం అందుబాటులోకి రానుంది.
తొలి దశలో మెట్రో రైలు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ప్రధాన కారిడార్‌లో పరుగులు తీయనుంది. ఈ మార్గం గాజువాక, ఎన్ఏడీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ వంటి అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా, ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. తర్వాతి దశలో ఈ మెట్రో లైన్‌ను అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మితమవుతున్న భోగాపురం వరకు పొడిగించనున్నారు. దీనివల్ల ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.
విశాఖపట్నం ఇప్పటికే ఏఐ, ఆర్థిక హబ్‌గా ఎదుగుతున్న తరుణంలో, ఈ మెట్రో ప్రాజెక్టు నగరాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారనుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో పారిశ్రామిక వేత్తలను, ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ఈ రవాణా వ్యవస్థ దోహదపడుతుంది. ఈ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నలభై శాతం నిధులు సమకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారంతో మిగిలిన నిధులు సమకూరుస్తుంది.