కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. రూ. 6,800 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గత ఏడాదిగా చెబుతోంది. ఒక్కటంటే.. ఒక్క రూపాయి కూడా ఇంత వరకూ విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం… పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ.. ఓ కొత్త వాదన తీసుకొచ్చింది. కేంద్రం ఇవ్వాల్సింది కేవలం రూ. 2వేల కోట్లు మాత్రమేనని.. మిగతా మొత్తంతో కేంద్రానికి సంబంధం లేదని… తేల్చి చెప్పేశారు. ఇది ఏపీకి ఓ షాక్ లాంటిదే..!
రూ. 4.800 కోట్లు ఏపీకి ఎగ్గొట్టనున్న కేంద్రం..!
నిబంధనల ప్రకారం… పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ.. నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది. నిర్మాణ బాధ్యతను ఏపీ ప్రభుత్వం తీసుకుంది. మేరకు.. ముందుగా.. చెల్లింపులు ఏపీ ప్రభుత్వం చేయాలి. ఆ తర్వాత బిల్లలను కేంద్రం రీఎంబర్స్ చేస్తుంది. ఈ మేరకు… పనులు ఆలస్యమైతే.. మొత్తానికే మోసం వస్తుందన్న ఉద్దేశంతో… గత నాలుగేళ్లుగా పోలవరం పనులు పరుగులు పెట్టాయి. దాదాపుగా 60 నుంచి 70 శాతం వరకూ ప్రాజెక్టు పూర్తయింది. ఏడాదిగా.. ఒక్క రూపాయికూడా.. పోలవరంకు కేంద్రం ఇవ్వలేదు. కనీసం.. నాబార్డు నుంచి రుణం కూడా మంజూరు చేయించలేదు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తం వెనక్కి రావడం అసాధ్యమని… పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పందనతో తేలిపోయింది. పోలవరం పనులను పరిశీలించిన అథారిటీ బృందం 30వ తేదీన అమరావతిలో అత్యున్నత సమావేశం నిర్వహించబోతోంది.
డీపీఆర్ -2 ఆమోదం ఎప్పుడు..?
అంచనాలు పెరిగిపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ -2ను.. కేంద్రానికి పంపి చాలా కాలం అయింది. అయితే.. ఇంత వరకూ కేంద్రం నుంచి ఆమోదం రాలేదు. ఎన్నికలకు ముందు.. సాంకేతిక ఆమోదం లభించిందని చెప్పుకొచ్చారు కానీ.. ఆ తర్వాత ముందడుగు పడలేదు. మరికొన్ని రోజుల్లో డీపీఆర్-2కు ఆమోదం లభిస్తుందని పీపీఏ ఛైర్మన్ జైన్ చెబుతున్నారు. ఇకపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని జైన్ స్పష్టం చేశారు. అయితే నిధుల చెల్లింపుపై పోలవరం అథారిటీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. కాంట్రాక్ట్ ఏజెన్సీల పనులపై పెండింగ్ బిల్లుల ప్రభావం పడుతోంది. కొత్త అంచనాలను కేంద్ర జలవనరులశాఖ ఆమోదిస్తేనే నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రాజెక్టు కట్టినా నీళ్లు నిల్వ చేయకుండా చేయబోతున్నారా…?
మరో వైపు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వంద శాతం .. ఖర్చు కేంద్రానిదే. అయితే.. కేంద్రం ఇక్కడే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కేవలం సిమెంట్ కట్టడాన్ని మాత్రమే ప్రాజెక్టులుగా పేర్కొంటోంది. ముంపు ప్రాంతాలకు ఇవ్వాల్సిన సహాయ, పునరావాస కార్యక్రమాలతో.. తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి … పోలవరం వల్ల కొన్ని లక్షల ఎకరాల ముంపు ఉంది. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం.. పరిహారం రెట్లు మూడు, నాలుగు శాతం పెరగడంతో.. పోలవరం అంచనాలు రూ. 50వేల కోట్లు దాటిపోయాయి. ఇప్పుడు ఆ పరిహారంతో తమకు సంబంధం లేదని కేంద్రం వాదిస్తోంది. వాటిని కేంద్రం మంజూరు చేయకపోతే.. ప్రాజెక్టు కట్టినా.. నీటిని నిల్వచేయడానికి అవకాశం ఉండదు. ఈ ఇబ్బందిని ఏపీకి కాబోయే కొత్త ముఖ్యమంత్రి జగన్ అధిగమించాల్సి ఉంది.