ఆర్టీసీ స‌మ‌స్య‌పై కేంద్రం జోక్యం మొదలైన‌ట్టే..!

ఆర్టీసీ కార్మికుల స‌మ‌స్య‌పై కేంద్ర‌మంత్రి నితిన్ గ‌ట్క‌రీతో చ‌ర్చించారు తెలంగాణ రాష్ట్ర భాజ‌పా నేత‌లు. కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డితో క‌లిసి రాష్ట్ర ఎంపీలు బండి సంజ‌య్, ధ‌ర్మ‌పురి అర‌వింద్, సోయం బాపూరావుల‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లారు. స‌మ్మె నేప‌థ్యంలో రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితులు, కోర్టులో వివాదాలు సాగిన తీరు, కార్మికుల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనుస‌రించిన వైఖ‌రిపై ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రికి రాష్ట్ర నేత‌లు వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది. గ‌ట్క‌రీతో భేటీ అనంత‌రం కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ అంశంలో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకునేందుకు సంపూర్ణ అధికారులున్నాయ‌నీ, ఇదే అంశ‌మై కేంద్రం ఆలోచిస్తోంద‌న్నారు. కార్మికుల‌పై ముఖ్య‌మంత్రి క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ విమ‌ర్శించారు.

ఆర్టీసీ కార్మికుల స‌మ‌స్య‌పై కేంద్ర‌మంత్రి హామీ ఇచ్చార‌నీ, త్వ‌ర‌లోనే రాష్ట్ర ర‌వాణా శాఖ‌మంత్రి, ఇత‌ర అధికారుల‌ను ఢిల్లీకి ర‌మ్మంటూ గ‌ట్క‌రీ కోర‌తార‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడేందుకు నితిన్ గట్క‌రీ దాదాపు గంట‌కుపైగా ప్ర‌య‌త్నించార‌నీ, అయినాస‌రే సీఎం అందుబాటులోకి రాలేద‌న్నారు ఎంపీ ధ‌ర్మపురి అరవింద్. ఆర్టీసీ కార్మికుల‌కు అన్యాయం జ‌రిగితే భాజ‌పా చూస్తూ ఊరుకోద‌న్నారు ఎంపీ బండి సంజ‌య్. విధుల్లోకి తీసుకోవ‌డంపై కార్మికుల‌కు ష‌ర‌తులు పెట్ట‌కూడ‌ద‌నీ, బకాయి ప‌డ్డ జీతాల‌ను కూడా వెంట‌నే విడుద‌ల చేయాల‌న్నారు.

ఆర్టీసీలో కేంద్ర వాటా ఉంది. కాబ‌ట్టి, దానికి అనుగుణంగా ఇప్పుడు భాజ‌పా స్పందించ‌డం ప్రారంభించింది. కేంద్ర చ‌ట్టం ప్ర‌కార‌మే ప్రైవేటీక‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు రాష్ట్రానికి ఉంటుంద‌ని కేసీఆర్ స‌ర్కారు వాద‌న‌. అయితే, ఈ అంశంలో కేంద్రానికి ఉన్న ప్ల‌స్ పాయింట్ ఏంటంటే… రోడ్లు ర‌వాణాకు సంబంధించిన అంశ‌మై రాష్ట్ర ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకున్నా, దాన్ని కేంద్రానికి తెలిజేయాల్సిన అవ‌స‌రం ఉంటుంది అంటూ కోర్టు కూడా వ్యాఖ్యానించింది. కేంద్రం వాటా, కేంద్రం చ‌ట్టం… ఈ రెంటినీ ప్ర‌ధానంగా ప్ర‌స్థావిస్తూ భాజ‌పా రంగంలోకి దిగుతోంద‌ని చెప్పొచ్చు. దాదాపు 50 వేల మంది కార్మికుల‌కు అండ‌గా ఉంటామ‌ని అంటున్నారు. అంటే, ఒక‌వేళ వారిని విధుల్లో తీసుకునే క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ష‌ర‌తులు పెడితే, కేంద్రం ఒప్పుకోద‌నేది ప‌రోక్షంగా భాజ‌పా నేత‌లు చెబుతున్న అంశం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com