కోర్టు తీర్పు త‌రువాతే ఆర్టీసీపై ప్ర‌భుత్వ నిర్ణ‌యం

ష‌ర‌తులేవీ లేకుండా విధుల్లోకి చేరాలంటూ ఆహ్వానిస్తే వెంట‌నే సమ్మె విర‌మిస్తామంటూ ఆర్టీసీ జేయేసీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతోంద‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. ఇదే అంశ‌మై ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్, ఎస్.కె.జోషి, ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శ‌ర్మ‌తోపాటు కొంత‌మంది అధికారుల‌తో సుదీర్ఘంగా స‌మీక్ష నిర్వ‌హించారు. కార్మికుల‌ను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశ‌మై చాలాసేపు చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. అయితే, దాదాపు ఐదు గంట‌ల‌పాటు స‌మీక్ష జ‌రిగిన త‌రువాత‌, ఎలాంటి తుది నిర్ణ‌యాన్నీ ప్ర‌భుత్వం వెల్ల‌డించ‌లేదు. శుక్ర‌వారం నాడు హైకోర్టు తీర్పు వెలువ‌రించాక ప్ర‌క‌టిస్తామ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. దీంతో కార్మికుల‌ను విధుల్లోకి తీసుకునే అంశ‌మై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే ఉత్కంఠ ఇంకా అలానే ఉంది.

ఆర్థిక మాంద్య ప‌రిస్థితులున్నాయి కాబ‌ట్టి, ఆర్టీసీ భారాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం మోసే అవ‌కాశం లేద‌ని స‌మీక్ష అనంత‌రం వెలువ‌డిన ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌భుత్వం పేర్కొంది. ప్ర‌స్తుతం ఉన్న మోడ‌ల్ లో ఆర్టీసీని న‌డ‌ప‌డం సాధ్యం కాద‌ని ప్ర‌భుత్వం అభిప్రాయ‌ప‌డుతోంది. స‌మ్మె అంశం ప‌రిష్కారంతోపాటు ప్ర‌స్తుతం జీతాలు ఇవ్వ‌డానికి రూ. 240 కోట్లు కావాల‌నీ, సీసీఎస్ బ‌కాయిల‌కు రూ. 500 కోట్లు కావాల్సి ఉంద‌నీ, 2600 కాలం చెల్లిన బ‌స్సులున్నాయనీ, పీఎఫ్ కూడా చెల్లించాల్సి ఉంద‌నీ, ర‌వాణ ప‌న్ను కూడా బాకాయిలున్నాయ‌ని ప్ర‌భుత్వం చెప్పింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆర్టీసీ న‌డ‌వాలంటే నెల‌కు దాదాపు రూ. 640 కోట్లు కావాల్సి ఉంటుంద‌నీ, ఈ భార‌మంతా భ‌రించే శ‌క్తి ఆర్టీసీకి లేద‌నీ, దీన్ని ఎవ‌రు భ‌రించాలంటూ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

కార్మిక సంఘాలు విధుల్లోకి చేర‌డానికి సిద్ధ‌మ‌న్నా, దానిపై ఎలాంటి నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వం ఇంకా తీసుకున్న‌ట్టుగా లేద‌నే అనిపిస్తోంది. రూట్ల ప్రైవేటీక‌ర‌ణ‌పై శుక్ర‌వారం కీల‌క తీర్పు కోర్టు వెలువ‌రించే అవ‌కాశం ఉంది. తీర్పు త‌రువాతే అన్ని అంశాల‌పై ప్ర‌భుత్వం అధ్య‌యనం చేస్తుంద‌నీ, ఆ త‌రువాతే ఆర్టీసీ కార్మికుల‌ అంశ‌మై ఏం చెయ్యాల‌నే తుది నిర్ణ‌యాన్ని వెలువ‌రించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అయితే, ప్రైవేటీక‌ర‌ణ అంశ‌మై కోర్టు తీర్పు సానుకూలంగా ఉంటుంద‌నే ధీమాతో ప్ర‌భుత్వం ఉంది. ఎందుకంటే, ప్ర‌పంచ‌మంతా గ్లోబ‌లైజేష‌న్ యుగంలో ఉంద‌నీ, విమాన‌యాన రంగంలో ప్రైవేటు సంస్థ‌లు ప్ర‌వేశించాకే స‌దుపాయాలు మెరుగ‌య్యాయంటూ గ‌త విచార‌ణ సంద‌ర్భంలో కోర్టు వ్యాఖ్యానించిన అంశం తెలిసిందే క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com