కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వదు – ఇవ్వను అనదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించిన గడువు ప్రకారం పోలవరం  ప్రాజెక్టు నిర్మాణం 2018 నాటికి పూర్తయి వినియోగంలోకి రావాలి. అయితే ఇపుడున్న పరిస్ధితుల్లో ప్రాజెక్టు పని ఎప్పటికి అవుతుందో చెప్పగలిగిన వారు లేరు. నిధులు లేకపోవడం, కాంట్రాక్టరు సహకరించకపోవడం,కేంద్రం పట్టించుకోకపోవడం మొదలైన సమస్యల నుంచి పోలవరం బయటపడలేకపోతోంది.

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నపుడు నిర్మాణం ప్రారంభమైంది. నాలుగున్నర వేల కోట్లరూపాయలు ఖర్చుచేశారు. రాష్ట్రవిభజన సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా నోటిఫై చేసి విభజన చట్టంలో పొందు పరచింది. ఆప్రకారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రప్రభుత్వమే సమకూర్చాలి. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా పనిని ముందుకి సాగనివ్వడం లేదు. వెనక్కి లాగడమూ లేదు. అసలు విధి విధానాల గురించి ఇంతవరకూ ఆలోచనే లేదు.

దాదాపు 17 వేలకోట్ల రూపాయలు ఖర్చయ్యే పోలవరం ప్రాజెక్టుకి మోదీ ప్రభుత్వం మొదటి బడ్జెట్టులో వందకోట్లు, మరుసటి సంవత్సరం బడ్జెట్టులో మరో వందకోట్ల రూపాయలూ కేటాయించింది. ఈ డబ్బు ఏమాత్రం చాలదని రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పుడు మరో రెండువందల కోట్లరూపాయలు విడుదల చేసింది. ఖర్చు వివరాలు బిల్లులతో పొందుపరచి కేంద్రం నిధులు పొందవచ్చని సూచించింది. నిధులకొరత తీవ్రంగా వున్న ఆంధ్రప్రదేశ్ కు ముందుగా ఖర్చపెట్టే స్తోమత లేదు. ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తాన్ని విడుదల చేయాలన్న విన్నపానికి కేంద్రం నుంచి సమాధానం లేదు.

మరోవైపు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు కృష్ణానదిలో కలిపి దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నదుల అనుసంధానం చేసిందని  ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రచారకర్తగా మారి ప్రపంచానికి చాటడం మొదలు పెట్టారు. 1700 కోట్ల రూపాయల పట్టిసీమ పధకం నిరర్ధకమైనదని రాష్ట్రంలో బిజెపి ముఖ్యులు నమ్ముతున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు అంచనాలను రాష్ట్రప్రభుత్వం రీ అసెస్ మెంటు చేయించింది. 17 వేల కోట్లరూపాయల ప్రాజెక్టు  భారం 30 వేలకోట్ల రూపాయలకు పెరిగిపోయింది.

ఈనేపధ్యంలో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు పదిహేను రోజుల క్రితం నిపుణుల బృందంతో ప్రాజెక్టుని పరిశీలించారు. నిధుల మళ్ళింపు ఆలోచనలతోనే నిర్మాణవ్యయాన్ని 30 వేలకోట్ల రూపాయలకు పెంచేశారని ఆయన ఢిల్లీ వెళ్ళి బిజెపి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కు ,కేంద్రజలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి కి ఫిర్యాదు చేశారు.

గోదావరి నదికి ఏటా జూన్‌ నుంచే వరదలు ప్రారంభమవుతుంటాయి. ప్రాజెక్టు నిర్మాణంలో చేపట్టాల్సిన ప్రధాన ఆనకట్ట పని నదిగర్భంలోనే జరగాల్సి వుంది. వరద లేని నదిలో నీటిప్రవాహం బాగా తగ్గాక ఈ పనులు చేసేందుకు వీలుంటుంది. వేసవిలోనే పనులు జరగాలి 2018 లోగా ఉన్నదే మూడు వేసవి సీజన్లు. నదిలో మట్టికట్ట వేసి నీటి ప్రవాహాన్ని పక్కదారి మళ్లిస్తేగాని అలుగు నిర్మాణం, ఆ తరువాత హెడ్‌రెగ్యులేటర్‌ నిర్మాణం, పవర్‌హౌస్‌ నిర్మాణాలు అవ్వవు.

పోలవరం ప్రధాన ఆనకట్ట నిర్మాణ పనుల కాంట్రాక్టును దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఇప్పటివరకూ పిడికెడు మట్టికూడా తీయలేదన్న విమర్శలు ఉన్నాయి. పైగా ఈ కంపెనీకి అనుభవం కూడా తక్కువే. వైఎస్ ఆర్ మరణం, ఆ తరువాత తెలంగాణా ఉద్యమం, రాజకీయ అనిశ్చిత్వాల వల్ల ఏపనీ సాగలేదు. జాప్యానికి ప్రభుత్వమే కారణమని కాంట్రాక్టు సంస్ధ రికార్డులను సిద్ధం చేసుకుని వుంది. ఈ దశలో సంస్ధను తప్పిస్తే భారీ పరిహారాలు చెల్లించవలసి వుంటుంది. ఇందువల్ల రాజీ పరిష్కారంగా అదే సంస్ధను కొనసాగిస్తూ అనుభవమున్న మరో సంస్ధను సబ్‌కాంట్రాక్టర్‌ గా చేసి పనులు అప్పగించాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి వున్నట్టు  చెబుతున్నారు. అయితే కేంద్రం నుంచి నిధుల విడుదలపై స్పష్టత లేకపోవడం వల్ల ఇదికూడా ఇంతవరకూ ఒక కొలిక్కి రానేలేదు.

పోలవరం ప్రాజెక్టు పనుల నిర్వహణ, పర్యవేక్షణకోసం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటిని నియమించింది. ప్రాజెక్టు పనులు అథారిటి పరిధిలోనే జరగాల్సి వుండగా ఆ బాధ్యతలను ఇంకా అథారిటీ చేపట్టలేదు. పనులు రాష్ట్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. పరిస్థితులు ఇదే తీరులో ఉంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేరు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com