భారతదేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా నలుగుతున్న అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన అంశం.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన . జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలు, కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే పార్లమెంట్లో తమ ప్రాతినిధ్యాన్ని, రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతామనే ఆందోళనలో ఉన్నాయి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన తాజా వర్కింగ్ పేపర్ దేశ రాజకీయంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకుండా.. పట్టణీకరణ, ఓటింగ్ సరళి, సామాజిక, భాషా పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక ‘టార్గెటెడ్ డెలిమిటేషన్’ మోడల్‌ను మండలి ప్రతిపాదించింది.
దక్షిణాది సీట్ల వాటా భద్రం.. హోంమంత్రి అమిత్ షా భరోసా!
ఈ ప్రతిపాదన వెనుక ఉన్న అసలు చాణక్యం ఏమిటంటే.. సీట్ల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ, లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత రాజకీయ వాటా ఎంతమాత్రం తగ్గదు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.76 శాతంగా 129 సీట్లు ఉంటే, ప్రతిపాదిత కొత్త విధానంలో పెద్ద రాష్ట్రాల్లో దాదాపు 50 శాతం సీట్లు పెరగడం వల్ల మొత్తం 816 నుండి 824 స్థానాల హౌస్‌లోనూ దక్షిణాది వాటా అదే 24 శాతంగా 195 సీట్లు కొనసాగుతుంది. పార్లమెంట్లో జరుగుతున్న చర్చల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. ఈ కొత్త మోడల్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ జరగదు, పైగా ప్రాతినిధ్యం మరింత పెరుగుతుంది అని భరోసా ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో మారనున్న రాజకీయ సమీకరణాలు!
పీఎం ఆర్థిక సలహా మండలి లెక్కల ప్రకారం.. ఈ ఫార్ములా అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాల లోక్‌సభ స్థానాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ స్థానాల సంఖ్య ఏకంగా 38 స్థానాలకు పెరగనుంది. విశాఖపట్నంతో పాటు రాజంపేట, కడప, కర్నూలు, అనంతపురం లోక్ సభ స్థానాలను మూడుగా విభజించి మిగిలిన వాటిని అంతే ఉంచాలని సూచించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 స్థానాల సంఖ్య 26 స్థానాలకు విస్తరించనుంది. హైదరాబాద్, సికంద్రాబాద్, మెదక్, మల్కాజిగిరి స్థానాలను మూడుగా చేసి.. చేవెళ్లను రెండుగా విభజించాలని ఆర్థిక మండలి సలహా ఇచ్చింది.
అదే స్థాయి నిష్పత్తి
ఇక పొరుగున ఉన్న తమిళనాడు సీట్లు 39 నుండి 59కి, కర్ణాటక సీట్లు 28 నుండి 42కి, కేరళ సీట్లు 20 నుండి 30కి పెరగనున్నాయి. అదే సమయంలో ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్ సీట్లు 80 నుండి 120కి, మహారాష్ట్ర సీట్లు 48 నుండి 72కి పెరిగినా.. రాష్ట్రాల వారీగా ఉన్న బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఈ టార్గెటెడ్ స్ప్లిట్ 170 నియోజకవర్గాలను రెండు లేదా మూడు భాగాలుగా విభజించడం డిజైన్ చేశారు. తక్కువ ప్రాతినిధ్యం ఉన్న చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్లను రెట్టింపు చేయాలని కూడా మండలి స్పష్టం చేసింది.
పార్లమెంట్ ముందుకు బిల్లు
ఈ నివేదిక కేవలం ఒక ప్రతిపాదనగానే కాకుండా, ‘ది డెలిమిటేషన్ బిల్, 2026’ రూపంలో చట్టసభల ముందుకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగా 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన సీట్ల సంఖ్య ఫ్రీజ్ గడువు ముగియడంతో, 2027 నాటి తదుపరి జనాభా లెక్కల అనంతరం ఈ చారిత్రాత్మక మార్పులు అమలు కానున్నాయి. దీనికి తోడు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అమల్లోకి రానున్నందున నియోజకవర్గాల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా ఓటర్లకు, ప్రజాప్రతినిధులకు మధ్య దూరం తగ్గుతుందని, జాతీయ ఓటింగ్ శాతం కూడా 2.3 శాతం మేర పెరుగుతుందని ఆర్థిక సలహా మండలి విశ్లేషించింది.


