ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు కేంద్రానికి అర్థమౌతూనే ఉంటాయి. మరోసారి ప్రత్యేక హోదా అంశం తెరమీదికి వచ్చింది. ఏపీకి భాజపా సర్కారు ఇచ్చిన హామీ ఇది! కాబట్టి, భవిష్యత్తులో తెలుగుదేశం ఇదే అంశమై యూటర్న్ తీసుకోదని గ్యారంటీ ఏంటీ..? అంటే… ప్రత్యేక హోదాను తెలుగుదేశం సాధించలేకపోయిందన్న అభిప్రాయం ఇప్పుడుంది! కానీ, ఎన్నికలకు వచ్చేసరికి తెలుగుదేశం ఉల్టా మాట్లాడితే, ‘కేంద్రం ఇవ్వకపోతే మేమేం చేస్తాం..? ప్రజలకోసం ప్యాకేజీ సాధించాం’ అని కొత్తరాగం ఎత్తుకుంటే..? మధ్యలో అడ్డంగా దొరికిపోవడం తప్ప భాజపాకు వేరే గత్యంతరం ఉండదు. సో.. ఇప్పుడు ఏపీలో వినిపిస్తోన్న ప్రత్యేకహోదా స్వరానికి వీలైనంత త్వరగా మంగళం పాడేయాలని కేంద్రం అనుకోవడం సహజం! ఆ దిశగా కేంద్రం ఆలోచనకు సమాయత్తం అవుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
స్పెషల్ స్టేటస్… ఈ పదాన్నే లేకుండా, వినిపించకుండా, ఎక్కడా కనిపించకుండా ఉండేలా చర్యలు చేపట్టేందుకు కేంద్రంలోని భాజపా సర్కారు ఆలోచిస్తోందని తెలుస్తోంది! ఒకవేళ ఆంధ్రాలో ఉద్యమం ఉగ్రరూపం దాల్చితే… అదే స్ఫూర్తితో మరికొన్ని రాష్ట్రాలూ ఇదే బాటలో కదం తొక్కే అవకాశం ఉంటుంది. తమిళనాట జల్లికట్టు ఉద్యమం ప్రభావం ఏపీ హోదాపై బాగానే పడింది కదా. ఇదే రిపీట్ కాకుండా ఉండాలంటే… 14వ ఆర్థిక సంఘం చెప్పినట్టుగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల్లో పెరిగిన శాతం గురించీ… ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులను అర్థం చేసుకుని, కేంద్రం అందివ్వబోయే సాయం గురించి.. ఇలాంటి వాటి గురించే ఇకపై కేంద్రం మాట్లాడుతుంది. రాబోతున్న బడ్జెట్లో ఈ పదమే వినిపించదని తెలుస్తోంది..!
అంటే, ఆంధ్రాలో మరోసారి తెరమీదికి వస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి ఎలాంటి ఫలితం ఉండదని కేంద్రం ముందస్తుగానే సంకేతాలు ఇస్తున్నట్టుగా భావించాలి. ప్రత్యేక హోదా అనే కాన్సెప్టే ఉండదు కాబట్టి… ఏపీకి ప్యాకేజీ వచ్చిందని ఏపీ భాజపా నేతలు మరోసారి టముకు వేయడం మొదలుపెట్టేశారు. ఏ పార్టీలు ఉద్యమించినా ఫలితం ఉండదనే విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా స్పష్టం చేస్తున్నట్టుగానే లెక్క. రాజకీయ కోణం నుంచి ఆలోచించినా కూడా ఈ కాన్సెప్ట్‌కి ఇక్కడితో ఫుల్స్టాప్ పెట్టడం భాజపాకి అత్యావశ్యకం అనాలి! ఈ నేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదా సాధన ఉద్యమ భవిష్యత్తు ఎలా ఉంటుందీ అనేది వేచి చూడాల్సిన అంశమే.