కేంద్రం చేతికి పోలవరం ప్రాజెక్ట్..!?

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిధి నుండి ప్రాజెక్టును తప్పించి.. ఆ బాధ్యతలను.. తామే తీసుకోవాలని కేంద్రం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చిందంటున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. దాదాపుగా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. పోలవరంపై ఇప్పటి వరకూ ఏం జరిగింది..? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది.. వంటి అంశాలను కూలంకషంగా చర్చించి.. ఓ నిర్ణయం తీసుకుంటామని షెకావత్ చెబుతున్నారు. ఆ నిర్ణయం ప్రాజెక్ట్‌ను తమ అధీనంలోకి తీసుకోవడమేనంటున్నారు.

అతి త్వరలో కీలక నిర్ణయం ఉంటుందన్న షెకావత్..!

పోలవరంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని… సుజనా చౌదరి కొంత కాలంగా.. చెబుతూ వస్తున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఏపీ వ్యవహారాలకు సంబంధించి.. కేంద్ర పెద్దలు ఆయన మాటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్‌ను వీలయినంత త్వరగా పూర్తి చేయాలనే సలహాను.. సుజనా చౌదరి ఇస్తున్నారు. రివర్స్‌ టెండరింగ్‌పై హైకోర్టు తీర్పు తర్వాత … సుజనా చౌదరి.. గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశారు. పోలవరం భవితవ్యంపై ఏపీ ప్రజల్లో గందరగోళం నెలకొందని .. త్వరితగతిన పూర్తయ్యేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. దానికి షెకావత్ సానుకూలంగా స్పందించారు.

జగన్ తమను లెక్క చేయకపోవడంపై కేంద్రం ఫైర్ ..!

వంద శాతం నిధులు ఇస్తున్నా.. ఏపీ సర్కార్ తమను లెక్క చేయకుండా.. తమకు అధికారం ఉందంటూ… కాంట్రాక్టర్లను టెర్మినేట్ చేయడం.. రివర్స్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయడం వంటి వాటిపై… కేంద్రం గుర్రుగా ఉంది. ఈ చర్యలన్నీ.. అస్మదీయులకు ఇచ్చుకునేందుకే.. వైసీపీ నేతలు చేస్తున్నారనే.. నివేదికలు కేంద్రానికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో.. ఈ అవకతవకలకు.. మోడీ, షాల అనుమతి ఉందనేలా.. వైసీపీ ప్రచారం చేసుకోవడంతో.. కేంద్ర పెద్దలు మరింత గుర్రుగా ఉన్నారంటున్నారు. అందుకే.. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో.. అసలు ఏపీ పాత్ర ఏమీ లేకుండా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్ట్‌ను తమ అధీనంలోకి తీసుకుని ఇక నేరుగా.. ప్రతి అంశాన్ని పీపీఏ ద్వారా పూర్తి చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఏపీ సర్కార్‌కు సంబంధం లేకుండా పీపీఏ ద్వారనే ఇక పోలవరం పనులు..!?

పోలవరం ప్రాజెక్ట్ ను.. తామే పూర్తి చేస్తే.. రాజకీయంగానూ లాభం ఉంటుందని… బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్రం నిర్మించి ఇచ్చిందనే ఇమేజ్.. ప్రజల్లో బలంగా ఉండాలంటే.. ఆ పని తామే చేయాలనుకుంటున్నామని.. బీజేపీ నేతలు నిర్ణయిచాంచారు. తమ ముద్ర బలంగా ఉండాలని.. వారు భావిస్తున్నారు. దీనికి ఏపీ సర్కార్ చేస్తున్న తప్పులు… కలసి వస్తున్నాయి. రివర్స్ టెండర్లను.. హైకోర్టు సస్పెండ్ చేయడంతో కేంద్రం… ప్రాజెక్ట్ పనుల బాధ్యతల నుంచి ఏపీ సర్కార్ ను తప్పిస్తూ… ఏ క్షణమైనా సంచలన ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com