Champion movie review
Telugu360 Rating: 2.5/5
తెలంగాణ నేపథ్య కథలకు ఇప్పుడు మరింత డిమాండ్ ఏర్పడింది. ఇక్కడి సంస్కృతిని, పోరాటాన్నీ, ఈగాలిలో కలిసిపోయి.. చరిత్రలో మిగిలిపోయిన వీరుల గాథల్ని కథలుగా చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని కథలు, సినిమాలు వచ్చినా తనివి తీరడం లేదు.
చెప్పాల్సిన కథలు, మిగిలిపోయిన గాథలు అన్ని ఉన్నాయి. బైరాన్ పల్లి ఘటన అక్కడి వీరగాథ కూడా చెప్పి తీరాల్సిన ఘనతే. దానికి ఫుట్ బాల్ అనే అంశాన్ని మేళవించి కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేసింది ‘ఛాంపియన్’. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన సినిమా ఇది. ‘మహానటి’, ‘సీతారామం’ లాంటి మేటి చిత్రాల్ని అందించిన స్వప్న సినిమాస్ సంస్థ రూపొందించింది. తెలంగాణ నేపథ్యం వల్ల ఇంకాస్త సొగసు అబ్బింది. ఇన్ని ఆకర్షణల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా వుంది? తన ప్రత్యేకతల్ని ఎలా నిలబెట్టుకోగలిగింది?
1947లో మన దేశానికి బ్రిటీష్ వారి నుంచి విముక్తి లభించింది. అయితే కొన్ని సంస్థానాలు మాత్రం ఇంకా స్వయంపాలన వైపే మొగ్గు చూపించాయి. అలాంటి వాటిలో హైదరాబాద్ సంస్థానం ఒకటి. ఇక్కడి పాలన నిజాం చేతుల్లో వుంది. రజాకార్ల దౌర్జన్యానికి ప్రజలు బలైపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బైరాన్ పల్లి గ్రామం రజాకార్ల పెత్తనంపై పిడికిలి బిగించింది. పోరాటాన్ని మొదలెట్టింది. ఎలాగైనా సరే.. బైరాన్ పల్లిని నాశనం చేసి, అక్కడ తమ జెండా పాతేయాలని నిజాం ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుంది. నిజాంని ఎదిరించాలంటే బైరాన్ పల్లికి ఆయుధాలు కావాలి. అందుకోసం బైరాన్ పల్లి గ్రామస్థులు తమ వంతు ప్రయత్నాలు మొదలెడతారు. ఈ దశలోనే మైఖెల్ (రోషన్) ఆ ఊర్లో అడుగుపెడతాడు. తనో ఫుట్ బాల్ ఆటగాడు. ఇంగ్లాండ్ వెళ్లి, అక్కడ స్థిరపడాలని కలలు కంటుంటాడు. తనకు యుద్ధాలంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ బైరాన్ పల్లి సమరంలో తాను కూడా భాగం అవుతాడు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? బైరాన్ పల్లికి సంబంధం లేని ఓ కుర్రాడు.. ఆ ఊరికి ఎందుకు వెళ్లాల్సివచ్చింది? చరిత్రలో మిగిలిపోయేంతగా తానేం సాధించాడు? అనేది మిగిలిన కథ.
యుద్థం చేయకపోతే మనుగడ కష్టమైన ఊరికి… అసలు యుద్ధం అంటేనే ఇష్టం లేని ఓ హీరో వెళ్లడం కొత్తగా అనిపించే పాయింట్. బైరాన్ పల్లి ఊరు, అక్కడి మనుషుల వీరోచిత పోరాటం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ఆ చరిత్రకు మైఖేల్ అనే ఓ ఫిక్షనల్ క్యారెర్టర్ జోడించడం, దానికి ఫుట్ బాల్ ఆటని ముడిపెట్టడం.. అనే ఆలోచనలు బాగున్నాయి. తెలంగాణ చుట్టూ ఎన్ని సినిమాలు తీసినా, మరో సినిమా రావడానికి స్కోప్ వుంటూనే ఉంటుంది. ఎందుకంటే ఈ మట్టి ఘనత అలాంటిది. ఇది పోరాటాల గడ్డ. ఇంత వరకూ చెప్పని, వినని కథలెన్నో బయటకు వస్తూనే ఉంటాయి. బైరాన్ పల్లి ఊరి గురించి పరిచయం ఉంది కాబట్టి.. కథలోకి త్వరగా కనెక్ట్ అయిపోతాడు ప్రేక్షకుడు. బైరాన్ పల్లి చరిత్ర ఓ ఎపిసోడ్ రూపంలో చెప్పిన తరవాత… మైఖేల్ గా రోషన్ పాత్రని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు. ఫుట్ బాల్ మ్యాచ్, అక్కడ హీరో ఛాలెంజ్ విసిరి గెలవడం ఇదంతా హీరోయిక్ గా అనిపించే అంశాలు. ఫుట్ బాల్ మ్యాచ్‌ని కూడా చాలా సహజంగా తెరకెక్కించారు. అయితే బైరాన్ పల్లి ఊరికి హీరో రావడం అనే పాయింట్ అంత సహజంగా కుదర్లేదనిపిస్తుంది. ఆయుధాల్ని సరఫరా చేయడానికి హీరో ఒప్పుకోవడం చాలా సినిమాటిక్ గా అనిపించే అంశం. బైరాన్ పల్లి ఊర్లోకి హీరో అడుగు పెట్టాక.. సన్నివేశాలు బోరింగ్ గా నడుస్తుంటాయి. దర్శకుడు ఎందుకో లవ్ స్టోరీపై పెద్దగా దృష్టి పెట్టలేదు. బైరాన్ పల్లి ప్రజలకు ఆయుధాలు కావాలి. అవి హీరో దగ్గర ఉన్నాయి. ఈ విషయం ఇంట్రవెల్ వరకూ నడిపించాడు. ఇంట్రవెల్ బ్యాంగ్ లో ఓ పెద్ద ఫైట్. అక్కడ బైరాన్ పల్లి ప్రజలకు ఆయుధాలు అందుతాయని, హీరో సాయం చేస్తాడన్న సంగతి ప్రేక్షకులకు ముందే తెలుసు. అలాంటప్పుడు ఆ సీన్ వీలైనంత త్వరగా వస్తే బాగుండేది. ఇంపాక్ట్ పరంగా చూసినా.. ఇంట్రవెల్ బ్యాంగ్ కి తక్కువ మార్కులే పడతాయి.
సెకండాఫ్‌లో కూడా దర్శకుడి దగ్గర చెప్పడానికి పెద్ద కథేం మిగల్లేదు. దాంతో సన్నివేశాలు పేర్చుకొంటూ వెళ్లాడు. వాటిలో ఎమోషన్ మిస్ అయ్యింది. హీరోకి, ఆ ఊరికీ మధ్య ఓ ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. అది సరిగా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. చాలా సన్నివేశాలు పేపర్ మీద బ్రహ్మాండంగా అనిపిస్తాయి. వాటిని తెరపైకి తీసుకురావడంలో మాత్రం ఆ ఇంపాక్ట్ కనిపించదు. ముఖ్యంగా సెకండాఫ్‌లో `గోల్` ఎపిసోడ్. చుట్టూ గుర్రాలపై పదకొండుమంది ప్లేయర్లు.. వాళ్ల చేతిలో ఆయుధాలు.. వాళ్లతో పోటీ పడి 20 సెకన్లలో గోల్ కొట్టాల్సిన అవసరం రావడం.. ఇదంతా బిల్డప్ కి బాగా సెట్టయ్యింది. కానీ ఇంత ఎమోషన్ స్క్రీన్ పై పండలేదు. ‘ఇది నా ఊరు.. మీరంతా నావాళ్లు’ అని హీరో చివరి వరకూ అనుకోడు. అలా అనుకొన్న సీన్ కూడా పెద్దగా రక్తి కట్టలేదు. ఫిరంగులు, నాటు బాంబులు తయారు చేసుకొన్న ఊరు అది. వాళ్లు తుపాకుల కోసం ఎదురు చూడడం అంత సహజంగా అనిపించదు. సినిమాటిక్ లిబర్టీ దర్శకుడు చాలా చోట్ల తీసుకొన్నాడు.
రోషన్ యాక్టీవ్‌గా ఉన్నాడు. తన డాన్సింగ్ స్టైల్ బాగుంది. నటన, స్క్రీన్ ప్రజెన్స్ కూడా నచ్చుతాయి. అనస్వర అందంగా ఉంది. డాన్సులు కూడా బాగా చేసింది. కల్యాణ చక్రవర్తి చాలా కాలం తరవాత తెరపై కనిపించారు. ఆయన ఎంట్రీ ఈ సినిమాకు కొత్తదనం తీసుకొచ్చింది. అయితే.. ఆ క్యారెక్టర్‌కు ఆయన మిస్ మ్యాచ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సీనియర్ నటి అర్చనకు సరైన పాత్ర పడలేదు. దుల్కర్ అతిథి పాత్రలో మెరిశాడు. తన రాక సర్ప్రైజ్ చేస్తుంది. ప్రకాష్ రాజ్‌ని వల్లభాయ్ పటేల్ పాత్రలో చూడొచ్చు.
ఆట ఆడాలంటే ఎలా ఆడాలన్న రూల్స్ తెలియాలి. ఆ తరవాత అందులో పరిణితి చూపించాలి. దర్శకుడికి ఇలాంటి సినిమా ఎలా తీయాలో.. అందులో ఏమేం ఉండాలో బాగా తెలుసు. దానికి తగిన వనరులు కూడా ఉన్నాయి. కానీ.. తెరకెక్కించడంలో అంత పరిణితి చూపించలేకపోయాడు. తెలంగాణ నేటివిటీ స్క్రీన్ పై పెద్దగా కనిపించలేదు. ప్రధాన పాత్రధారులంతా యాస బాగానే మాట్లాడారు. అయితే నరేష్ డైలాగులల్లో గోదావరి యాస కొట్టొచ్చినట్టు కనిపించింది. తెలంగాణ నేపథ్యంలో సినిమాలు తీస్తున్నప్పుడు యాస విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బైరాన్ పల్లి అనే ఊరు కూడా ఓ పాత్రే. అలాంటప్పుడు ఆ ఊరిని ఎంత సహజంగా చూపించాలి? అది ఈ సినిమాలో కుదర్లేదు. `గిర గిర గింగిరానివే` పాట హుషారుగా వుంది. పెళ్లి పాట బాగున్నా.. కథకు, ఎమోషన్‌కీ ఉపయోగపడలేదు. కెమెరాపనితనం, ఆర్.ఆర్, మేకింగ్ వాల్యూస్ ఇవన్నీ చక్కగా ఉన్నాయి. అయితే దర్శకుడు రాసింది రాసినట్టుగా తీయగలిగితే ఇంకా బాగుండేది.
Telugu360 Rating: 2.5/5
