ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ఎలాంటి కార్యక్రమంలో అయినా ప్రభుత్వ పనిపైనా ఆలోచిస్తూంటారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న పవన్ కల్యాణ్‌ను పరామర్శించడానికి సీఎం చంద్రబాబు వెళ్లారు ఈ సందర్భంగా పరామర్శలు అయిన తర్వాత అధికారిక కార్యక్రమాలపై చర్చించారు. పవన్ కల్యాణ్ ..నాలుగైదు రోజులుకు కార్యాలయానికి దూరంగా ఉంటున్నారు.. అందుకే వచ్చే నెలలో అమలు చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
జ్వరం తగ్గినా దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోందని పవన్ కల్యాణ్ చంద్రబాబుకు తెలిపారు. పరీక్షలు చేసి క్రానిక్ బ్రాంకైటిస్ మూలంగా దగ్గు ఎక్కువగా వస్తోందని, ఫలితంగానే గొంతు దగ్గర నొప్పి కూడా ఉందని వైద్యులు చెప్పినట్లు వివరించారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడాన్ని పవన్ ప్రస్తావించారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామకపత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించి యువతలో మనోధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారని నింపారన్నారు. అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో…’ కార్యక్రమంపై చర్చించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని విజయవంతంగా అమలు చేయగలిగామని, తద్వారా మహిళలకు ఆర్థికపరమైన వెసులుబాటు కలుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ పథకం మూలంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక భరోసాను కల్పించే దిశగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని, 4 వ తేదీన విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఆటో డ్రైవర్ల కోసం ఆలోచన చేసిన, చేపట్టిన ఈ పథకం కూడా కచ్చితంగా అందరి మన్ననలు పొందుతుందనే విశ్వాసాన్ని పవన్ వ్యక్తం చేశారు. అక్టోబర్ 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయడంపై చర్చించారు.