ఏపీ గవర్నర్ ఆధ్వర్యంలో కోడెల ఆత్మహత్య కేసు విచారణ..!?

Kodela Siva Prasad

గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి..కోడెల ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు చేయిస్తానని హామీ ఇచ్చారని… టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. కోడెల ఆత్మహత్య ఘటన..పోలీసులు పెట్టిన కేసులు.. సాక్షి మీడియాలో కోడెలపై చేసిన విష ప్రచారం.. తదితర అంశాలన్నింటినీ కలిపి.. రాజ్‌భవన్‌లో గవర్నర్ హరించందన్ బిశ్వభూషణ్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ దాడులు, అక్రమ కేసులపైనా వివరాలు అందచేశారు. 13 పేజీలతో గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చారు. తన అధికారాలను ఉపయోగించి విచారణ చేయిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని.. కోడెల మృతిపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రాన్ని కోరతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

డీజీపీ కూడా ప్రభుత్వానికి సరెండర్‌ అయ్యారని.. చట్టానికి లోబడే పోలీసులు పని చేయాల్సి ఉంటుందని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ నాయకులను ఉగ్రవాదుల్లాగా స్టేషన్లకు తిప్పుతున్నారని.. మండిపడ్డారు. సోమిరెడ్డిపై ఎప్పుడో ఉన్న కేసుకు ఇప్పుడు ఎఫ్ఐఆర్‌ నమోదు చేయడం, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేనిపై కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. గుంటూరు ఎస్పీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరు ఎస్పీ నీ బాధ్యతలు సక్రమంగా చేయి… పదవుల కోసం ఏకపక్షంగా వ్యవహరించొద్దుని హెచ్చరించారు. పోలీసులు ప్రజల్లో చులకన కావద్దన్నారు. సుప్రీంకోర్టులో పోలీసులు, ప్రభుత్వంపై న్యాయ పోరాటం‌ చేస్తాంమని ప్రకటించారు. సాక్షి పత్రిక, మీడియాలో నీచమైన ప్రచారం చేస్తున్నారని ..ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి పోస్టులపై కేసులు ఎందుకు పెట్టలేదుని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది నేరస్తుల రాజ్యం.. నేరం చేసేవారు దర్జాగా తిరగొచ్చని ఎద్దేవా చేశారు.
మానం, మర్యాద ఉన్నవాళ్లు ఈ ప్రభుత్వంలో బతకలేరన్నారు.

వేధింపులకు గురి చేసి కోడెల ఆత్మహత్య చేసుకునేలా చేశారని .. దేశ రాజకీయాల్లో కోడెల ఆత్మహత్య ఓ కేస్ స్టడీగా మారుతుందన్నారు. టీడీపీ నేతలకు బెయిల్‌ రావొద్దనే ఉద్దేశంతో అట్రాసిటీ కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కోడెలపై సోషల్‌మీడియాలో విషప్రచారం చేశారని.. అసెంబ్లీ ఫర్నిచర్‌ విషయంలో కోడెల చేసిన తప్పేంటని ప్రశ్నించారు. ఫర్నిచర్‌ను దొంగ సొత్తుగా ఎందుకు చిత్రీకరించారు… ప్రస్తుతం సీఎం, మంత్రుల దగ్గర ఉన్న ఫర్నిచర్ దొంగ సొత్తా అని ప్రశ్నించారు. కోడెల ఆత్మహత్యకు సంబంధించి… కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని.. టీడీపీ పట్టుదలతో ఉంది. అయితే.. వైసీపీ మాత్రం గతంలో.. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా చేశారని.. గవర్నర్ వ్యవస్థ పనికిమాలిదని అన్నారని.. ఇప్పుడు… వాటినే ఎందుకు ఆశ్రయిస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com