ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఒక సీరియస్ పరిణామం చోటుచేసుకుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మున్సిపల్ పరిపాలన ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తీరును చంద్రబాబు తప్పు పట్టారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో గా వరుసగా మూడు అగ్నిప్రమాదాలు జరగడం వెనుక కుట్ర ఉందని ప్రభుత్వం నమ్ముతోంది. ముఖ్యంగా రాయపూడి సమీపంలోని మెఘా ఇంజనీరింగ్ స్టాక్ యార్డ్లో భారీగా నిల్వ ఉంచిన కోట్ల రూపాయల విలువైన పైపులు దగ్ధమవ్వడంపై కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ క్రమంలో మంత్రి నారాయణను ఉద్దేశించి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా మున్సిపల్ శాఖ ఎందుకు మౌనంగా ఉంది? అసలు ఇవి ప్రమాదాలా లేక ఎవరైనా కావాలని చేస్తున్న కుట్రలా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
మున్సిపల్ శాఖకు సంబంధం లేనట్లుగా వ్యవహరించడం సరికాదని, విచారణ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని చంద్రబాబు మంత్రిని నిలదీశారు. అమరావతిలో వేల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నప్పుడు, ఇంతటి నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే మూడుసార్లు ఇలాంటి ఘటనలు పునరావృతమవ్వడం వెనుక ఏదైనా విద్రోహ చర్య ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేవలం ఫైర్ డిపార్ట్మెంట్ రిపోర్టుల కోసం వేచి చూడకుండా, శాఖా పరంగా పకడ్బందీ నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రాజధాని నిర్మాణ పనులకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో ఎవరైనా కావాలని చేస్తున్నారా అనే కోణంలో డీజీపీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని చంద్రబాబు నిర్ణయించారు. వేల కోట్లు ఖర్చు పెట్టి పనులు జరుగుతూంటే ఇలాంటివి జరగకూడదని.. భద్రతా పరమైన లోపాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి, ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థల స్టాక్ యార్డుల వద్ద కూడా పోలీసు నిఘా పెంచాలని సూచించారు. నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనలపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని మున్సిపల్ శాఖ అధికారులను , మంత్రిని చంద్రబాబు ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటన జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని కచ్చితమైన సంకేతాలు ఇచ్చారు.
