ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచీ టిడిపి అనుకూల మీడియాలో కూడా తరచుగా కనిపిస్తున్న వార్తలను గమనిస్తే బాబు మార్క్ ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో ఎవరికైనా అర్థమైపోతుంది. విపక్ష పార్టీలకు చెందిన నాయకులందరినీ ఫ్యాక్షనిస్టులుగానూ, రౌడీలుగానూ చిత్రీకరించడానికి తాపత్రయపడుతూ ఉండే బాబు…ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చేస్తున్నదానిని ఏమంటారో టిడిపి వారే చెప్పాలి. తనకు బలం లేని చోట పోటీ పడకూడదన్న ఉద్ధేశ్యంతో ముందే చేతులెత్తేశాడు జగన్. పక్కాగా గెలిచే అవకాశమున్న స్థానాల్లోనే పోటీ చేస్తున్నాడు. ఇక మిగతా స్థానాల్లో మాత్రం బలమైన స్వతంత్ర అభ్యర్థులకు మద్ధతు ఇస్తున్నాడు. కానీ చంద్రబాబు మాత్రం అన్ని స్థానాలను గెలుచుకోవాలన్న తాపత్రయంలో ఉన్నాడు. మంత్రులందరినీ ఉసిగొల్పుతున్నాడు. జెసి బ్రదర్స్ హంగామా అయితే అంతా ఇంతా కాదు. వైసిపి నాయకులను టిడిపి నేతలు కిడ్నాప్ చేస్తున్న వార్తలు ఆంధ్రజ్యోతి పత్రికలోనే కనిపిస్తున్నాయి. అలాగే స్వతంత్ర అభ్యుర్థలు అందరిపై ‘ఒత్తిడి’ తీసుకొచ్చి మరీ పోటీ నుంచి విరమించుకునేలా చేయడంలో టిడిపి నేతలు సక్సెస్ అయ్యారని టిడిపి అనుకూల మీడియాలోనే వార్తలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నవాళ్ళు తీసుకొచ్చే ఒత్తిడి ఏంటో…ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదుగా.
సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పగా మాట్లాడేస్తూ ఉంటారు చంద్రబాబు. ఎన్నికలు ఎలా నిర్వహించాలి? ఎంత స్వేఛ్ఛగా ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఉండాలి లాంటి విషయాలపై జాతీయ స్థాయి సదస్సులలో కూడా లెక్చర్లు దంచుతూ ఉంటారు. కానీ వాస్తవంలో మాత్రం పరిస్థితి ఇలా ఉంటుంది. అయినా ఈ ‘ఒత్తిడి’ తీసుకొచ్చి పోటీలో నిలబడ్డవాళ్ళను భయపెట్టటమేంటి? వాళ్ళు పోటీ నుంచి విరమించుకున్న తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు అని డప్పు కొట్టుకోవడమేంటి? ఇదేనా బాబు చెప్పే ప్రజాస్వామ్యం. పోటీలో ఎక్కువ మంది ఉంటే ప్రజలకు ఛాయిస్ ఉంటుంది. లేకపోతే దివాకర్ ట్రావెల్స్తో వాళ్ళను చంపేస్తున్న వాళ్ళకు, రౌడీలకు ఓట్లేయాల్సిన పరిస్థితులో ప్రజలు ఉంటారు. కానీ బాబుగోరు మాత్రం అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోటీయే లేకుండా గెలిచేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. స్వతంత్ర అభ్యర్థుల్లో కొంతమంది చాలా మంచివాళ్ళు, యోగ్యులు ఉన్నారని వార్తలు వచ్చాయి. మంచివాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని అస్తమానం చెప్తూ ఉండే బాబు ఇప్పుడు అలాంటి వాళ్ళందరిపైనా ‘ఒత్తిడి’ తెచ్చి వెనక్కు పంపేశారన్నమాట. అయినా పోటీలేకుండా గెలిచే గెలుపు కూడా ఓ గెలుపేనా? అఫ్కోర్స్…అలా వచ్చిన గెలుపును చూపించి కూడా…మాకు ప్రజా మధ్ధతు ఉంది అని చెప్పి ప్రచారం చేసుకోగల సామర్థ్యం బాబు సొంతం అనుకోండి. జగన్ గెలవకుండా అడ్డుకుంటే రాజకీయం అని సరిపెట్టుకోవచ్చు. కానీ స్వతంత్ర అభ్యుర్థుల విషయంలో కూడా జగన్ పార్టీ అభ్యుర్థుల విషయంలో చేసినట్టుగానే చేయడం మాత్రం బాబు స్థాయికి అస్సలు తగదు. దేశంలో ప్రత్యర్థి పార్టీలు ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజాస్వామ్యం తగలబడిపోతూ ఉందని మాటలు చెప్తూ ఉండే వెంకయ్యనాయుడికి ఆంధ్రప్రదేశ్లో తగలబడిపోతున్న ప్రజాస్వామ్యం గురించి స్పందించే తీరకలేదేమో. జనసేన అధినేతకు కూడా ఇప్పుడిప్పుడే చంద్రబాబును ఇబ్బందిపెట్టడం ఇష్టం లేనట్టుగా ఉంది. 2014 ఎన్నికల్లో జగన్, కెటీఆర్లను ఉద్ధేశ్యించి మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలకు నేను వ్యతిరేకం అని చెప్పిన పవన్………ఇప్పుడు లోకేష్ గురించి మాట్లాడాల్సి వస్తుందన్న ఉద్ధేశ్యంతో స్టాండ్ మార్చేశాడు. యోగ్యత ఉంటే వారసులు కూడా రాజకీయాల్లోకి రావొచ్చు అని చెప్పేశాడు. ఈ ఒక్క డైలాగ్ చాలు……..ఎలాంటి వాడైనా సమర్థించుకోవడానికి. ఆ యోగ్యత అంటే ఏంటో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు కాబట్టి……ఎవరైనా ఎంట్రీ ఇవ్వొచ్చన్న అర్థమన్నమాట. ఇలాంటి నాయకులు ఉండగా ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకట్టేది ఎలా? బాబుగోరి అప్రజాస్వామిక విధానాల గురించి వచ్చే విమర్శలకు కూడా బాబు దగ్గర ముందుగానే సమాధానం ఉంటుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఎంతమంది నాయకులు ఎన్ని అప్రజాస్వామిక పనులు చేశారో చెప్పుకొచ్చి…వాళ్ళకంటే నేను బెటర్ అని నమ్మించగల సామర్థ్యం బాబు సొంతం.