హైదరాబాద్: ప్రత్యేకహోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ ముగిసింది. అయితే ఈ భేటీలో ఏపీకి మళ్ళీ నిరాశే మిగిలింది. హోదాపై ఎలాంటి హామీ లభించలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేరుస్తామనని ప్రధాని నరేంద్ర మోడి చెప్పినట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. మోడితో చంద్రబాబు భేటి ముగిసిన తర్వాత అరుణ్ జైట్లీ చంద్రబాబుతోకలిసి మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ప్రధానితో భేటీలో విస్తృతంగా చర్చలు జరిగాయని జైట్లీ చెప్పారు. నీతి ఆయోగ్ అధికారులు ఆంధ్రప్రదేశ్ అధికారులతో చర్చలు జరుపుతున్నారని, ఏపీ ప్రజాప్రతినిధులతోకూడా చర్చలు జరిపి రోడ్ మ్యాప్ రూపొందిస్తారని తెలిపారు. విభజన చట్టంలోని 46,90,94 సెక్షన్‌లపై ప్రధానంగా చర్చించామని చెప్పారు.
ఇవాళ ఉదయం వెంకయ్య నాయుడు నివాసంలో వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. జీఎస్‌టీ బిల్లుపై చర్చించటానికి హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అదే సమయంలో అక్కడకు రావటంతో ముగ్గురు నేతలమధ్య చర్చలు కొద్దిసేపు చర్చలు జరిగాయి. తర్వాత చంద్రబాబు మోడిని కలవాటినికి వెళ్ళారు. ఆయన వెంట కంభంపాటి హరిబాబు, ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు ఉన్నారు.